Nikhat Zareen Gold Medal : బర్మింగ్ హాంలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్  స్వర్ణ పతకం సాధించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ తో సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. బంగారు పతకాన్ని సాధించి  భారత దేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేశావని నిఖత్ జరీన్ విజయపరంపరను అభినందించారు సీఎం కేసీఆర్. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని సీఎం మరోసారి తెలిపారు.  






ప్రధాని మోదీ ట్వీట్ 


నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. 'నిఖత్ జరీన్ భారతదేశానికి గర్వకారణం. ఆమె ప్రపంచ స్థాయి క్రీడాకారిణి.  CWGలో గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆమెను అభినందిస్తున్నాను. వివిధ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తూ నిలకడగా నిఖత్ రాణిస్తోంది. ఆమె భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు చెబుతున్నాను' అని ప్రధాని మోదీ అన్నారు. 






హుస్సాముద్దీన్ కు కాంస్యం 


కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్ వాసి హుస్సాముద్దీన్ కు కాంస్య పతకం రావడంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల పుట్టినిల్లుగా నిజామాబాద్ మారిందన్నారు. కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్ కు సుబేదార్ హుస్సాముద్దీన్ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించారు. హుస్సాముద్దీన్ విజయం సాధించడమంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా, తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి కామన్ వెల్త్ క్రీడలో రెండో సారి పథకం సాధించిన హుస్సాముద్దీన్ కు మంత్రి వేముల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్,హుస్సాముద్దీన్ ల గెలుపు యావత్ నిజామాబాద్ ప్రజలకు గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. నిఖత్ జరీన్ మొదటి కోచ్ శంషాముద్దీన్ కుమారుడే హుస్సాముద్దీన్ అని మంత్రి తెలిపారు. నిజామాబాద్ బిడ్డలను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దినందుకు కోచ్ శంషాముద్దీన్ కు మంత్రి ప్రత్యేక అభినందలు తెలిపారు.