CM Revanth Reddy Davos Tour: సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి విదేశీ పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ (Davos)లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం' (World Economic Forum) 54వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలోని తెలంగాణ అధికారిక బృందం వెళ్లింది. ఈ నెల 19 వరకూ ఈ సదస్సు జరగనుండగా.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సీఎం వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇదే తొలిసారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే ప్రాధాన్యతలు అన్నింటినీ ఈ సదస్సులో వివరించనున్నట్లు చెప్పారు.


3 రోజుల పర్యటన


3 రోజుల దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. కొత్త ప్రభుత్వ దార్శనికతను, ప్రాధాన్యతలను అందరికీ వివరించనున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దేశ, అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ వేదికలో నోవార్టిస్, మెడ్ ట్రానిక్, ఆస్ట్రాజెనికా, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో భేటీ అవుతారు. అలాగే, భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఐఐ, నాస్కామ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరో స్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం.


సీఎంకు ప్రత్యేక గౌరవం


సీఎం రేవంత్ రెడ్డికి తొలి దావోస్ పర్యటనలోనే ప్రత్యేక గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో ప్రసంగించాల్సిందిగా ఆయన్ను నిర్వాహకులు ఆహ్వానించారు. అక్కడ 'పురోగమిస్తున్న వైద్య రంగం' అనే అంశంపై చర్చాగోష్టిలో మాట్లాడనున్నారు. అలాగే, 'ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్' అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులోనూ రేవంత్ పాల్గొంటారు. వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధి పరిరక్షణ, వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలు వంటి అంశాలపై ప్రసంగిస్తారు. అటు, ఏఐ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో 'డెవలప్ మెంట్ స్కిల్స్ ఫర్ ఏఐ' అనే అంశంపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించనున్నారు. 


ఈ పర్యటనలో ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బర్గె బ్రెండ్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. తెలంగాణతో ప్రపంచ ఆర్థిక వేదికకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలున్నాయని మంత్రి తెలిపారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగంపై ఫోరానికి సంబంధించి 'సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్' సదస్సు త్వరలో హైదరాబాద్ లో జరగబోతోందని చెప్పారు. కాగా, దావోస్ సదస్సులో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటున్నారు. వీరిలో 60 మందికి పైగా ప్రభుత్వాధినేతలు ఉన్నారు.


Also Read: TSRTC Special Bus: ఆర్టీసీలో ఒక్కరోజే అర కోటి మంది ప్రయాణం, తొలిసారి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు