TSRTC News: సంక్రాంతి పండుగకి తెలంగాణ ఆర్టీసీ (TSRTC) బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు. భారీ సంఖ్యలో ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు పేర్కొన్నారు. అరకోటి మంది ఆర్టీసీలో ప్రయాణించగా అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారని సజ్జనార్ వెల్లడించారు. 


శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో బస్సులు.. 
గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో శనివారం ఒక్క రోజే 1861 టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపింది. అందులో 1127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో నడిపింది. సంక్రాంతి పండుగ సందర్బంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్‌ చేయగా.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో జనవరి 11, 12, 13 తేదిల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడపగా.. శనివారం వరకు మొత్తం 6261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు సజ్జనార్ తెలిపారు. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ నడిపింది.


తొలిసారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 
ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చిందన్నారు. తొలిసారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామన్నారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


విషాదం నింపిన వినోదం!
పిల్లల వినోదం కాస్త విషాదంగా మారి బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చగా.. మయాదారి మంజా బైక్‌ పై వెళ్తోన్న ఆర్మీ జవాన్‌ ప్రాణాలను బలితీసుకోవడం కలిచివేసిందన్నారు సజ్జనార్. పండుగ పూట ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈ మరణాలకు పరోక్షంగా పిల్లల తల్లిదండ్రులే కారణం అని అభిప్రాయపడ్డారు. వారు పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండబట్టే.. ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షిస్తుండాలని సూచించారు. నిషేధమున్న ప్రమాదకర నైలాన్, చైనీస్‌, గ్లాస్‌ కోటేడ్‌ మాంజాను ఉపయోగించకుండా.. సాధారణ మాంజాను వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న తమ పిల్లల ప్రాణాలతో పాటు రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలు కూడా ఇలా గాల్లో కలిసిపోతాయని జాగ్రత్తలు చెప్పారు.


ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది హడావిడిలో తమ సామానులను మరచిపోతుంటారు. ఆర్టీసీ బస్సుల్లో మర్చిపోయిన సామాన్లు ఆర్టీసీ అధికారులు ఏం చేస్తారు, మరిచిపోయిన బ్యాగులు, వస్తువులు తిరిగి ఎలా పొందవచ్చో కరీంనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం ఏబీపీ దేశంతో మాట్లాడారు. ఎవరైనా వస్తే వారి వివరాలు తీసుకొని దాన్ని ఇచ్చేద్దామనుకున్నారు. ఎవరు రాకపోతే వేలం వేస్తామని డిపో మేనేజర్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో పేలుడు పదార్థాలు, జంతువులను వెంట తీసుకెళ్లడం నేరమని చెబుతున్నారు.