INDvsAFG 2nd T20I: సొంత గడ్డపై జరుగుతున్న రెండో టీ20లో భారత్ ముందు అఫ్గానిస్తాన్ బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని నిలిపారు. గుల్బదీన్ (57 పరుగులు; 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో 20 ఓవర్లలో అఫ్గాన్ 172 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు.
ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈనెల జనవరి 11న జరిగిన తొలి టీ20లో భారత్ గెలిచి సిరీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నేటి మ్యాచ్ నెగ్గి సిరీస్ విజయాన్ని ఇండోర్ లో ఖాయం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే అఫ్గాన్ బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోరు చేశారు.
ఇన్నింగ్స్ స్కోరు 20 వద్ద అఫ్గాన్ తొలి వికెట్ కోల్పోయింది. అఫ్గాన్ ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్ (14)ను రవి బిష్ణోయ్ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ 8 పరుగులకు అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ గుల్బదీన్ (57 పరుగులు; 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. జర్దాన్(23), నబీ(14) తక్కువ స్కోరు చేసి ఔటయ్యారు. చివర్లో కరీమ్ జనత్ (10 బంతుల్లో 20), ముజీబుర్ రెహ్మాన్ (9 బంతుల్లో 21) పరుగులతో రాణించడంతో అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. చివరి ఓవర్లో అఫ్గాన్ 4 వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం కాస్త తగ్గింది.