టీ-20 ప్రపంచకప్‌నకు ముందు మిగిలిన చివరి టీ-20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్(Bharat) పట్టుదలగా ఉంది. మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్ వేదికగా అఫ్గానిస్తాన్(Afghanistan)తో రెండో మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను గెలవాలని రోహిత్ సేన భావిస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి టీ-20కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రెండో మ్యాచ్‌కు జట్టుతో కలిశాడు. 14 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనున్న కోహ్లీపై అందరి దృష్టి నెలకొంది. కోహ్లి చివరిసారిగా 2022 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు
429 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి క్రికెట్ ఆడుతున్న కోహ్లీను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 35 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12 వేల పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు.టీ 20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (14562) పేరిట ఉంది. ఈ జాబతాలో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (12993), విండీస్ టీ20 స్పెషలిస్ట్ కీరన్ పోలార్డ్ (12430) గేల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్
అఫ్గాన్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌పై భారత్ కన్నేసింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా(Team India) ఇండోర్ వేదికగా జరగనున్న రెండో టీ-20లో గెలిచి సిరీస్ ఒడిసి పట్టాలని చూస్తోంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఇందౌర్ పిచ్‌పై చెలరేగాలని ఇరుజట్ల బ్యాటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఫ్లాట్ పిచ్, బౌండరీలు చిన్నవి కావడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు మెుదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 2017లో ఇదే వేదికపై శ్రీలంకపై 260 పరుగులతో టీమిండియా టీ-20 చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది.
రోహిత్‌పైనే అందరి చూపు
మెదటి మ్యాచ్‌లో సమన్వయం లోపంతో సున్నా పరుగులకే రనౌటైన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో గాడిన పడాలని చూస్తున్నాడు. టీ-20 ప్రపంచ కప్‌నకు ముందు కేవలం రెండు అంతర్జాతీయ టీ20ఉండడంతో సత్తాచాటాలని భావిస్తున్నాడు. మరోవైపు తొలి టీ20కి వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ రెండో టీ-20కు అందుబాటులో ఉండనున్నాడు. కోహ్లీ రాకతో హైదరాబాదీ యవ బ్యాటర్ తిలక్ వర్మపై.. వేటు పడనుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే శుభమన్ గిల్‌పై వేటు పడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో రాణించిన శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకూ సింగ్ మరోసారి రాణించాలని చూస్తున్నారు. బౌలింగ్‌లో మరోసారి ముగ్గురు స్పిన్నర్లతో మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్‌లు తుది జట్టులో ఉండనున్నారు. పేస్ బాధ్యతలను ముఖేశ్ కుమార్, అర్షదీప్ పంచుకోనున్నారు.