Gautam Adani's Favorite Cricketer: భారత్‌లో రెండో అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్ కంపెనీల (Adani Group Companies) అధిపతి అయిన గౌతమ్ అదానీ.. ఒక క్రికెటర్‌కు వీరాభిమాని అయ్యారు. ఆ క్రికెటర్ పేరు ఊహించగలరా..?. మీరు అనుకున్న పేరు తప్పు.
గౌతమ్ అదానీ అభిమాన క్రికెటర్ అమీర్ హుస్సేన్ (Aamir Husain). ఈ పేరు ఎప్పుడూ వినలేదు, ఇతనిది ఏ దేశం అనుకుంటున్నారా?. అమీర్ హుస్సేన్ అచ్చమైన భారతీయుడు. జమ్ము&కశ్మీర్ వాసి. జమ్ము&కశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్ అతను. అతని ఆటతీరులోని స్పెషాలిటీ గౌతమ్ అదానీ హృదయాన్ని సూటిగా తాకింది, ఆకట్టుకుంది. దీంతో, అమీర్‌కు అండగా నిలబడాలని అదానీ నిర్ణయించుకున్నారు.
అదానీ ట్వీట్
అమీర్ గురించి చెబుతూ, తన X హ్యాండిల్‌లో ఒక చిన్న వీడియోను గౌతమ్ అదానీ షేర్ చేశారు. "అమీర్ భావోద్వేగ కథ అద్భుతంగా ఉంది. మీ ధైర్యానికి, ఆట పట్ల అంకితభావానికి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టు వదలని స్ఫూర్తికి మేము వందనం చేస్తున్నాం. అదానీ ఫౌండేషన్ త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఈ ప్రత్యేకమైన ప్రయాణంలో మీకు సాధ్యమైన ప్రతి సాయాన్ని అందిస్తుంది. మీ పోరాటం మా అందరికీ స్ఫూర్తిదాయకం" అని ట్వీట్ చేశారు.
అమీర్ హుస్సేన్ 2013 నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. దివ్యాంగుడినని నిరుత్సాహ పడలేదు, పట్టు వదల్లేదు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు అతను ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు. రెండు చేతులు లేనప్పటికీ, తన కాళ్లతో బౌలింగ్ చేసారు, మెడతో బ్యాటింగ్ చేస్తారు. అద్భుతమైన ప్రతిభ కారణంగా భారత పారా క్రికెట్ జట్టులో కూడా చోటు సంపాదించారు. 34 ఏళ్ల అమీర్ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నివాసి. తొలుత, అతని ప్రత్యేక ప్రతిభను అతని కోచ్ కనిపెట్టారు. పారా క్రికెట్ గురించి అమీర్‌కు చెప్పి ఉత్సాహపరిచారు. దీంతో, అమీర్ 2013లో వృత్తిపరంగా క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.
సచిన్ టెండూల్కర్ ట్వీట్
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూడా X హ్యాండిల్‌లో అమీర్ వీడియోను షేర్ చేస్తూ ఒక పోస్ట్ రాశారు. "అమీర్, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశారు. అతని స్ఫూర్తి నా హృదయాన్ని తాకింది. క్రికెట్ పట్ల అతనికి ఎంత ప్రేమ, అంకితభావం ఉందో ఈ వీడియో చెబుతోంది. ఆయనను ఒకసారి కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. ఆ రోజున, అతని పేరుతో ఉన్న జెర్సీని తీసుకుంటాను. క్రీడలపై ప్రేమ ఉన్న కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచినందుకు అమీర్‌కు కృతజ్ఞతలు" అని ట్వీట్‌లో రాశారు.
ఎనిమిదేళ్ల వయసులో ప్రమాదం
అమీర్ హుస్సేన్, తన ఎనిమిదేళ్ల వయసులో రెండు చేతులను కోల్పోయారు. ఆయన, తన తండ్రితో కలిసి ఒక మిల్లులో పని చేసేవారు. అక్కడ జరిగిన ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు.
మరో ఆసక్తికర కథనం: మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి, ఏ డాక్యుమెంట్లు అవసరం?