సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలోని వెంకటేశ్వర ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. నామినేషన్ పత్రాలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, ప్రతిసారి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్న కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు స్వాగతం పలికారు. అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం కేసీఆర్ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. స్వామి వారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈసారి గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కేసీఆర్ బరిలో నిలిచారు. ఈ నెల 9న ఉదయం గజ్వేల్ లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కేసీఆర్ సెంటిమెంట్
సీఎం కేసీఆర్ కు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం సెంటిమెంట్. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే ఆయన నామినేషన్ వేస్తారు. సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు సైతం ఎన్నికల సమయంలో ఇక్కడి వెంకన్నకు దర్శించుకొని స్వా మి వారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారీ కేసీఆర్ ను విజయం వరించింది. కేసీఆర్ ఏ పని తలపెట్టినా కచ్చితంగా పూజలు చేస్తారు. ఆయనకు భక్తి భావం ఎక్కువ. యజ్ఞ యాగాలు కూడా చేయిస్తుంటారు. ఆయన వాస్తును కూడా ఎక్కువగా నమ్ముతారు. ఈ కారణంగానే ఆయన కొన్ని భవనాల రూపురేఖలు కూడా మార్చారని చెబుతారు. ఇవన్నీ ఓ ఎత్తైతే కోనాయిపల్లి వెంకటేశుని దర్శనం వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. 38 ఏళ్లుగా ఆయన ఈ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు.
1985లో తొలిసారిగా
1983లో తొలిసారిగా టీడీపీ నుంచి సిద్ధిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, కోనాయిపల్లి వెంకటేశ్వరుని ఆలయం చాలా శక్తిమంతమైనదనీ, అక్కడ పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని సన్నిహితులు సూచించారు. ఈ క్రమంలో 1985లో మధ్యంతర ఎన్నికలు రాగా, అప్పుడు కోనాయిపల్లి వెంకన్నను దర్శించి, ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేశారు. ఆ ఎన్నికల్లో గెలుపు వరించడంతో అది ఆయనకు బలమైన సెంటిమెంట్ గా మారింది. అప్పటి నుంచి ప్రతిసారీ ఎన్నికలప్పుడు ఇలాగే చేస్తున్నారు. 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలోనే నామినేషన్ పత్రాలకు పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేసి విజయం సాధించారు. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్.. ఆ తర్వాత ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్ పార్టీని సైతం ప్రకటించారు.
Also Read: సోషల్ మీడియా బాండ్ - అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీల న్యూ ట్రెండ్