Nepal Earthquake: 


ప్రధాని మోదీ విచారం..


నేపాల్‌లో భూకంపం (Nepal Earthquake) ఒక్కసారిగా హడలెత్తించింది. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వెయ్యి మందికిపైగా గాయపడ్డట్టు సమాచారం. ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇటు ఉత్తరాదిలోనూ ఈ భూకంప ప్రభావం కనిపించింది. ఈ క్రమంలోనే భారత్‌ స్పందించింది. అన్ని విధాలుగా నేపాల్‌కి అండగా ఉంటామని ప్రకటించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi on Nepal Earthquake) ఈ విషయమై స్పందించారు. ఈ సవాలుని దాటేందుకు ఆ దేశానికి అవసరమైన సాయం తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. భూకంపం సృష్టించిన ఈ విధ్వంసంపై విచారం వ్యక్తం చేశారు. ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 


"నేపాల్‌లో భూకంప ధాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా విచారించాల్సిన విషయం. ఇలాంటి విపత్కర సమయంలో నేపాల్‌కి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు భారత్ సిద్ధంగా ఉంది. వీలైనంత వరకూ సాయం చేస్తాం. ఈ ప్రమాదంలో అయిన వాళ్లను కోల్పోయిన కుటుంబ సభ్యులకూ అండగా ఉంటాం. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం"


- ప్రధాని నరేంద్ర మోదీ




అర్ధరాత్రి ఉన్నట్టుండి ప్రకంపనలు..


అక్టోబర్ 3వ తేదీన అర్ధరాత్రి ఉన్నట్టుండి నేపాల్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ తీవ్రత 6.4గా నమోదైంది. కళ్ల ముందే భవనాలు కూలిపోయాయి. నిద్రలో ఉన్న వాళ్లు ఉలిక్కిపడ్డారు.  ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఈ ప్రభావం ఢిల్లీ-NCRలోనూ కనిపించింది. ఇక్కడా భూమి స్వల్పంగా కంపించింది. నేపాల్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు, ప్రజలకు సాయం అందించేందుకు ఆ దేశ సైన్యం (Nepal Army) రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పశ్చిమ నేపాల్‌లోని జరాకోట్, రుకమ్ జిల్లాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. నేపాల్ హోం మంత్రిత్వ శాఖ (Nepal Home Ministry) లెక్కల ప్రకారం..ఈ రెండు జిల్లాల్లోనే 141 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు నాలుగు సార్లు ఇక్కడే భూమి కంపించింది. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ (Pushpakamal Dahal Prachanda) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మెడికల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నేపాల్ ఆర్మీతో పాటు నేపాల్ పోలీసులూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.