శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాల్లో పెద్ద పులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో పులి సంచరిస్తోంది. అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి జాడ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఇంత వరకూ పులి కదలికలపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి తమ పశువులపై దాడి చేసి చంపేస్తుందని, రాత్రే కాదు పగలు కూడా బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుందని వాపోతున్నారు. 


అసలు పులేనా


కాగా, కొన్ని ప్రాంతాల్లో పశువులపై దాడి జరుగుతున్నా, అది పులేనా అన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా, కంచిలి మండలం జాడపూడి ఎంపీటీసీ జామి జయమ్మకు చెందిన ఆవుదూడపై ఓ గుర్తు తెలియని జంతువు దాడి చేసింది. స్థానికులు పెద్ద పులే దాడి చేసిందని అనుమానం వ్యక్తం చేస్తూ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దాడి చేసిన జంతువు పాదముద్రలు పెద్ద పులి కన్నా చిన్నవిగా ఉన్నాయని గుర్తించారు. దీంతో దాడి చేసింది పులి కాదని తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారిస్తున్నారు. 


పశువులపై దాడి


గత కొద్ది రోజులుగా కవిటి, కంచిలి మండలాల్లోని పలు గ్రామాల్లో పశువులపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది. సహలాలపుట్టుగలో ఆవు, కొండిపుట్టుగలో గేదె దూడపై పులి దాడి చేయడంతో అవి మృతి చెందాయి. గుజ్జుపుట్టుగ గ్రామంలో ఆవు దూడకు తీవ్ర గాయాలయ్యాయి. ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ, ఈదుపురం, కొఠారీ, ధర్మపురం, రాజపురం పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు స్థానికులు ఆనవాళ్లు గుర్తించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎ.మురళీకృష్ణంనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఆయా గ్రామాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రాంతాల వారిని అలర్ట్ చేశారు. 


అధికారుల అలర్ట్


జిల్లాలో పులి సంచారంపై డీఆర్ఓ నిషాకుమారి స్పందించారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పులి సంచారం ఉందని వెల్లడించారు. పులి తిరుగున్నట్లు అక్టోబర్ 25న అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి పులి జాడ తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తూనే ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏవైనా అనుమానాస్పద గుర్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఏమైనా పెంపుడు జంతువులపై పులి దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. పులి సంచారంపై సమీప గ్రామాల్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. 


పుకార్లు షికార్లు


మరోవైపు, పులి సంచారంపై సోషల్ మీడియాలో వదంతులు సైతం వేగంగా వ్యాపిస్తున్నాయి. తమ ప్రాంతంలో పులిని చూశామని కొందరు, తమ ప్రాంతంలో పులి పశువులపై దాడి చేసి చంపిందని ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల పులిని చూసి చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నట్లు ఓ వ్యక్తి చెప్పగా, మరికొందరు పులి సంచారంపై వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే, కొన్నింటిపై ఎలాంటి అధికారిక సమాచారం ఉండడం లేదు. ఇలాంటి పుకార్లతో ఆయా ప్రాంతాల ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. వీటిలో ఎంత వరకూ నిజమన్నది తెలియక సతమతమవుతున్నారు. అయితే, పులి సంచారంపై ఫేక్ సమాచారం షేర్ చేయడం నేరమని, అలా చేస్తే చర్యలు తప్పవని అటవీ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Also Read: తిరుమల ఘాట్ రోడ్డులో భారీ కొండచిలువ ప్రత్యక్షంతో కలకలం!