దళితుల ఆర్థిక స్థితిని మెరుగు పరిచే కార్యక్రమం దళిత బంధును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాను చెప్తే వందకు వంద శాతం దళిత బంధును అమలు చేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నో పథకాలు చెప్పి వాటన్నింటినీ అమలు చేసినట్లుగానే దళిత బంధును కూడా కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. సోమవారం నల్గొండ జిల్లా హాలియాలో ప్రగతి సమీక్ష సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికకు ముందు తాను ఇచ్చిన హామీల అమలుపై తాను ఎప్పుడో హాలియాకు రావాల్సి ఉందని, కానీ కరోనా కారణంగా రావడం ఆలస్యమైందని అన్నారు.


తెలంగాణ దళిత జాతి దేశానికి ఆదర్శం
దళిత బంధు గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దళిత బంధును అనేక మంది అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 16 నుంచి 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ పథకానికి అర్హులు 80 శాతం ఉంటారనుకుంటే ఓ 12 లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు వచ్చేలా నిధులను బడ్జెట్‌లో కేటాయించాం. రాబోయే బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించి దశల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దళితులను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ పథకం మొదలు పెట్టగానే విపక్షాలకు గుండె దడ మొదలై, బీపీ పెరుగుతుంది. ఇది తాను అమలు చేస్తే రాజకీయంగా వాళ్లకి ఇక పుట్టగతులు ఉండవని అనుకుంటున్నారు. ఈ దళిత బంధు పెట్టాలని నాకు ఎవరూ చెప్పలేదు. ఎవరూ నాకు దరఖాస్తు, ధర్నా చేయలేదు. తెలంగాణ తెచ్చిన వాడిగా నేనే మేథోమథనం చేసి అన్ని వర్గాలను ఆదుకుంటున్నాం. అలాగే మన తెలంగాణలో దళిత జాతి భారత దళిత జాతికి ఆదర్శంగా నిలుస్తుంది. 


కృష్ణా నీటిని వదలబోం
‘‘కృష్ణా నది నీటిని ఏపీ తరలించుకుపోవడం వల్ల మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. వాళ్లు నీళ్ల విషయంలో దాదాగిరి చేస్తున్నారు. అందుకే పెద్ద దేవులపల్లి చెరువు - పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసి గోదావరి నీళ్లు తెచ్చి కృష్ణా నదితో అనుసంధానం చేయాలని గతంలోనే నిర్ణయించాం. దీనిపై సర్వే జరుగుతోంది. ఇది పూర్తయితే నాగార్జున సాగర్ ఆయకట్టు బాగవుతుంది. గతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వకపోతే పోరాడి మన వాట సాధించాం. జిల్లాలోని సాగర్ ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లు అందేలా చేసుకున్నాం. ఇదే పద్ధతిలో కృష్ణా నదిలో మన వాటా తీసుకొని రెండు పంటలకు నీళ్లిస్తామని’’ సీఎం కేసీఆర్ అన్నారు.


సాగర్‌కు వరాల జల్లు.. 
హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లుగా కేసీఆర్ హామీ ఇచ్చారు. వీటితో వెంటనే అభివృద్ధి పనులు చేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. నందికొండ మున్సిపాలిటీలో ఇరిగేషన్ భూముల్లో ఉంటున్న వారికి ఆ స్థలాలన్నీ రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కేవలం నెల రోజుల్లోనే వాటికి సంబంధించిన హక్కు పత్రాలు, దస్తావేజులు ఇచ్చేస్తామని వివరించారు. అంతేకాక, నల్గొండ జిల్లాకు మొత్తం 15 నీటిపారుదల లిఫ్టులు మంజూరయ్యాయని కేసీఆర్ చెప్పారు. ‘‘నాగార్జున సాగర్‌కు ఇప్పటికే రూ.150 కోట్లు ప్రకటించాను. వాటన్నింటినీ త్వరలోనే అధికారులు అమలు చేస్తారని’’ కేసీఆర్ పేర్కొన్నారు.


వైద్యం రంగం ఇంకా మెరుగు పడాలి: కేసీఆర్
రాష్ట్రంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని కేసీఆర్ అన్నారు. అందుకోసం రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో 33 మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌కు తోడు హైదరాబాద్‌లో మరో నాలుగు సూపర్ స్పెషల్ హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ‌లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 18 వేల బెడ్స్‌ను ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసుకునే బెడ్స్‌గా మార్చుకున్నామని.. మరో ఏడు కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను మంజూరు చేసుకున్నామని వివరించారు.