తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు తాను రాసిన సూసైడ్ నోట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. తాను డిగ్రీ, ఐటీఐ చదివినా ఉద్యోగం రాలేదని, ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చూసి తాను విసిగిపోయానని వివరించాడు. చివరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసినా తన వయసు పరిమితి దాటిపోయిందని లేఖలో వాపోయాడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక, తాను తనువు చాలిస్తున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశాడు.


కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మొహమ్మద్ షబ్బీర్ అనే 26 ఏళ్ల యువకుడు.. ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మీదుగా వెళ్లే తెలంగాణ ఎక్స్‌‌ప్రెస్ రైలు కింద పడి తనువు చాలించాడు. నిరుద్యోగం కారణంగానే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌‌లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


Also Read: Dalitha Bandhu Telangana: దళితబంధు అమలు తేదీ ఖరారు, ఆ రోజు నుంచే హుజూరాబాద్‌లో.. కేబినెట్ నిర్ణయం


‘‘నా చావుకి కారణం నిరుద్యోగం. తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తది అని ఎంతో ఆశగా ఎదురు చూశా. నన్ను ఎంతో కష్టపడి డిగ్రీ, ఐటీఐ వరకూ చదివించారు. కానీ, నాకు జాబ్ రాలేదు. నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసి చూసి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది. నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా చావు ఒకటే మార్గం అనిపించింది. అందుకే చనిపోతున్నా. నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న నా భార్యకు సారీ. నేను ఏ ఉద్యోగం సాధించలేకపోయా. నాకు చావు తప్ప వేరే దిక్కు లేదు. అందుకే చనిపోతున్నా.’’ అని షబ్బీర్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి చనిపోయాడు.



కుమారుడి మరణంపై అతని తల్లిదండ్రులు స్పందిస్తూ.. తెలంగాణ వస్తే తమ బిడ్డకు ఉద్యోగం వచ్చి తమను పోషిస్తాడని అనుకున్నామని, చెట్టంత ఎదిగిన కుమారుడు ఇలా ట్రైన్ కింద పడి చనిపోయాడని షబ్బీర్ తల్లిదండ్రులు అంకుష్ మియా, యాకోబి విలపించారు. షబ్బీర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


Also Read: Kadapa: తన అందమే పెట్టుబడిగా యువకుడి దందా, ఏకంగా 200 మందితో.. అసలు సంగతి తెలిసి షాక్