బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు ఎలా సమాయత్తం కావాలో సూచించారు. ఇప్పటిదాకా తమ ప్రభుత్వం చేసింది చెప్పుకుంటే చాలని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలియజెప్పాలని నిర్దేశించారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్ పెట్టాలని, చెరువు గట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలని చెప్పారు. గత 70 ఏండ్లలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదని, వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ 105 సీట్లు సాధిస్తుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకో 5 నెలలు మాత్రమే సమయం ఉందని అన్నారు.


రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై సూచనలు


జూన్ 2న తెలంగాణ అవతరణ ఉత్సవాల నిర్వహణపై కూడా సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. మంత్రులు ఆయా జిల్లాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరపున కూడా గ్రామ, గ్రామాన వేడుకలు ఘనంగా నిర్వహించాలని నేతలను ఆదేశించారు. కర్ణాటక ఎన్నికలపై కూడా కేసీఆర్  ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. 


‘‘సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే ఎక్కువ శాతం సీట్లు ఉంటాయి. నేను చెప్పిన‌ట్లు ప్రతి ఒక్కరు ఆచ‌రిస్తే ప్రతి ఒక్కరికీ 50 వేల క‌న్నా ఎక్కువ మెజారిటీ వ‌స్తుంది. రాష్ట్రం సాధించిన ప్రగ‌తిని చూసి దేశం తెలంగాణ మోడ‌ల్ కావాల‌ని చుట్టుపక్కల రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. మ‌హారాష్ట్రలోనూ ప్రజ‌లు సైతం మ‌న‌కు బ్రహ్మరథం ప‌డుతున్నారంటే అందుకు మ‌నం ఆచ‌రించి చూపిన మోడ‌లే అని గుర్తుంచుకోవాలి. కులం, మ‌తంపై ఏ పార్టీ గెల‌వ‌దు. అన్ని వ‌ర్గాల‌ను స‌మాన దృష్టితో చూడ‌డ‌మే బీఆర్ఎస్ విజ‌య ర‌హ‌స్యం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.


Also Read: Hyderabad: నల్ల కవరులో మహిళ తల! మొండెం వెతికినా జాడ లేదు - మలక్‌పేట్‌లో మిస్టరీగా కేసు


కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ మనకి ఉండదు - కేసీఆర్


కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ కర్ణాటక ఫలితాలను పట్టించుకోవద్దని కేడర్‌కు సూచించారు. అక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కేసీఆర్‌ అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ప్రజా ప్రతినిధులు అందరూ ప్రణాళిక రూపొందించుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.


సింగరేణి తీసుకుంటామంటే ఒప్పుకోట్లేదు - కేసీఆర్


తమ పాలనలో తెలంగాణ వజ్రపు తునక అయిందని కేసీఆర్ అన్నారు. ఇవాళ ఏపీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. సింగరేణి గనుల సంస్థను మొత్తం తెలంగాణ ప్రభుత్వమే తీసుకోడానికి సిద్ధంగా ఉందని, అందుకు కేంద్ర ప్రభుత్వం, మోదీ ఒప్పుకోట్లేదని అన్నారు. గుజరాత్‌ మోడల్‌ బోగస్‌ అని కొట్టిపారేశారు. దేశం తెలంగాణ మోడల్‌ కోరుకుంటోందని అన్నారు. బీఆర్ఎస్ కు బాసులు, భగవద్గీత, వేదాలు.. అన్నీ తెలంగాణ ప్రజలే అని అన్నారు. కల్తీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రజలకు తెలియజేయాలని ప్రజా ప్రతినిధులకు చెప్పారు. పారదర్శక, అవినీతి రహిత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.


Also Read: Kodali Nani: జగన్ హీరో, చంద్రబాబు విలన్, ఆర్జీవీతో డైరెక్షన్ - నేను మాట్లాడతా: కొడాలి నాని సెటైర్లు