మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై ఓ న్యూస్ యాప్ పేరుతో ప్రచురించిన వార్త కలకలం రేపింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగం మంది కూడా గెలవరని, జగన్ హవా ఎన్నికల్లో కనిపించదన్నట్టుగా అనిల్ మాట్లాడారనేది ఆ వార్త సారాంశం. త్వరలోనే అనిల్ టీడీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, అనిల్ పార్టీ మారడం ఖాయమంటూ ఆ వార్తలో రాసుకొచ్చారు. అయితే అది ఫేక్ న్యూస్ అని తేలింది. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అనిల్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. 


Also Read: 26న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ - ఎజెండా ఏమిటంటే ?


ఫేక్ వార్తలతో జరుగుతున్న ప్రచారంపై వైసీపీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా వార్తను సృష్టించి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. 


మూడు రోజులుగా అనిల్ పై వార్తలు..
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ మూడు రోజులుగా నగరంలో లేరని.. ఆయనపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన అనుచరులు, వైసీపీ నేతలు. ఆయన్ను నేరుగా ఎదుర్కోలేక, కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇటీవల సీఎం జగన్ కావలి పర్యటనలో అనిల్, రూప్ కుమార్ యాదవ్ ని చేయి చేయి కలిపి కలసి ఉండాలని సూచించారు. అయితే ఆ తర్వాత అనిల్ కామెంట్లు కొన్ని బయటకు వచ్చాయి. రూప్ తో కలిసేది లేదని ఆయన చెప్పినట్టు వార్తలొచ్చాయి. వాటిపై అనిల్ స్పందించలేదు. నిజంగానే అనిల్ ఆ వ్యాఖ్యలు చేశారా లేక ఆయన వర్గం లీకులిచ్చిందా అనేది తేలాల్సి ఉంది. తాజాగా అసలు అనిల్ పార్టీ మారిపోతారంటూ వార్తలు రావడం మాత్రం కలకలం రేపింది. 


నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు జగన్ తోనే నేనుంటా అని చెప్పిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. పార్టీలోనే తనకు అవమానం జరిగిందని, అనుమానించారని.. అనుమానాలున్నచోట తాను ఉండలేనని బయటకు వచ్చేశారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కూడా జగన్ విషయంలో ఇలాంటి మాటలే చెబుతుంటారు. ప్రజల దయతో, జగనన్న దయతో తాను ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రినయ్యానని అంటుంటారు. అలాంటి అనిల్ పార్టీ మారతారని, పార్టీపై నిందలేస్తారని ఎవరూ ఊహించరు. కానీ సోషల్ మీడియా పోస్టింగ్ మాత్రం అందరిలో అనుమానాలు రేకెత్తించింది. దీన్ని మొగ్గలోనే తుంచేయాలనే ఉద్దేశంతో అనిల్ వర్గం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఫేక్ పోస్ట్ సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 


అనిల్ నేరుగా ఈ పోస్టింగ్ లపై స్పందించలేదు. బహుశా ఆయన కూడా ఈ వ్యవహారంపై నేరుగా స్పందిస్తారని తెలుస్తోంది. ముందుగా ఆయన అనుచరులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 


Also Read: గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చిన ఈసీ- జనసేన నుంచి జారిపోయినట్టేనా!