తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ "దళిత బంధు" పథకం పై జరిగిన సమీక్షలో చివరి రక్తపు బొట్టు వరకూ దళితుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానన్నారు. ఆ తర్వాత దళితుల రిజర్వేషన్ పెంచుకునే ప్రయత్నం చేద్దామని కూడా ప్రకటించారు. దీంతో రిజర్వేషన్ల అంశం ముందు ముందు ఎన్నికల్లో హామీల్లో ఒకటయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వినిపిస్తోంది. తెలంగాణ జనాభాలో 18శాతం దళితులు ఉన్నారని.. ఆ ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందనే అభిప్రాయం మాటల్లో వ్యక్తమయింది. ప్రస్తుతం దళిత్ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారు కాబట్టి ఆయన ఈ విషయంలో మరింత ముందుకెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. మరి నిజంగా దళితలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చా..? అలాంటి వెసులుబాటు ఉందా..? ఇంతకు ముందు కేసీఆర్ ఇతర వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్ హామీలు అమలయ్యాయా..?
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు టీఆర్ఎస్ సర్కార్ విధానం..!
తెలంగాణలో విద్య, సామాజికంగా వెనుకబడిన కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్టీల స్థితిగతులపై చెల్లప్ప కమిషన్, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, బిసిల స్థితిగతులపై బి.ఎస్. రాములు కమిషన్‌ను నియమించారు. కానీ దళితుల రిజర్వేషన్లను పెంచాలనే ఆలోచన చేయలేదు. ఎలాంటి కమిషన్ ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత సకల జనుల సర్వే నిర్వహించారు. దళితుల సంఖ్య 18 శాతం, గిరిజనుల సంఖ్య పది శాతం, మైనార్టీల సంఖ్య 14శాతం ఉండగా బీసీల సంఖ్య 50 శాతానికిపైగా ఉన్నట్లుగా లెక్కించారు. 2014లో టీఆర్ఎస్ ఎన్నికల హామీల్లో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు హామీ కూడా ఉంది. వీటిని నెరవేర్చడానికి 2017 ఏప్రిల్ 16న అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆమోదించారు. దీని ప్రకారం తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి, ముస్లింల రిజర్వేషన్లు 4 నుంచి 12 శాతానికి పెరిగాయి. కానీ అమల్లోకి రావాలంటే కేంద్రం ఆమోద ముద్ర వేయాలి. కానీ ఇప్పటి వరకూ ఆమోదం రాలేదు. రిజర్వేషన్లు అమలు కాలేదు. దీనికి కారణం యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్నది సుప్రీంకోర్టు తీర్పు. తెలంగాణ సర్కార్ చేసిన బిల్లుతో ఆ రిజర్వేషన్ల శాతం 62శాతానికి చేరుతుంది. దాంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది.
ఎస్సీలు, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని గతంలో అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటనలు..!
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఎస్సీలు, బిసిలకు కూడా రిజర్వేషన్లు పెంచుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణలో ఎస్సీల జనాభా 18 శాతానికి పైగా ఉంది. వారికి 15 శాతం మాత్రమే రిజర్వేషన్ అందుతోంది. అప్పట్లోనే ఎస్సీలకు ఒక శాతం రిజర్వేషన్ పెంచుతామని కూడా ప్రకటించారు. కానీ ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లకు ఇంత వరకూ ఆమోదముద్ర రాలేదు.దాంతో ఎస్సీ రిజర్వేషన్ పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేకపోయారు.
తమిళనాడులో 69 శాతానికిపైగా రిజర్వేషన్లు..!
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు మలవుతున్నాయి. తమ రాష్ట్రంలో 87 శాతం మంది బలహీన వర్గాలే అని ...69 శాతం రిజర్వేషన్లు అమలు చేసుకుంటామని చట్టం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా పొందింది. తమిళనాడులోలానే తెలంగాణలో కూడా ఎస్సీ, ఎస్టీ, బిసి, వర్గాలే పెద్ద సంఖ్యలో ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం చెబుతోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేసుకుంటామని అంటోంది. కానీ కేంద్రం ఆమోదించడం లేదు.
కేసీఆర్ రిజర్వేషన్ పెంపు హామీతో దళితులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారా..?
కేసీఆర్ రిజర్వేషన్ పెంపు అంశంపై మాట్లాడటంతో త్వరలో అది ఎన్నికల అంశం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే రిజర్వేషన్లు కేంద్రం చేతిలోని అంశాలని వాటిపై హామీలు ఇవ్వడం మోసం చేయడమేనని ఇతర పార్టీల నేతలు వాదిస్తున్నారు. అసెంబ్లీలో చట్టం చేసి రిజర్వేషన్లు అమలు చేశామని చెప్పడం సరి కాదంటున్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఎస్టీలు, ముస్లింలకు ఉన్నంత తక్కువగా దళితులకు రిజర్వేషన్లు తక్కువేమీ లేవు. 15శాతం ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో వారి జనాభా 16 శాతం.. సకల జనుల సమ్మె ప్రకారం 18 శాతం మాత్రమే. పెంచడం సాధ్యమవుతుందా లేదా అన్నది ప్రభుత్వమే ఆలోచించాలి. కానీ దళితుల్ని ఆకట్టుకునే క్రమంలో రిజర్వేషన్ పెంపు అనేది మరో ఆకర్షణీయమైన హామీ అయ్యే అవకాశం ఉంది.