హైద‌రాబాద్ : తెలంగాణ పెద్ద పండుగ దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ సింగ‌రేణి ఉద్యోగుల‌కు శుభవార్త చెప్పారు. సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక ప్రక‌టించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విజయదశమి లోపు ఈ వాటా మొత్తాన్ని ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. 368 కోట్ల రూపాయలను అర్హులైన ఉద్యోగులకు సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది.


గత ఆర్థిక సంవత్సరం లాభాల్లో వాటా..
2021 -22 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను సింగరేణి ఉద్యోగులకు అందించనున్నారు. ఈ మొత్తాన్ని సింగరేణిలో అర్హులైన ఉద్యోగులకు, సిబ్బందికి దసరా కానుకగా అందించాలని  సీఎం కేసీఆర్ బుధవారం నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి   కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని (Dasara Bonus) మొత్తాన్ని దసరా పండుగ లోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 






కవిత హర్షం


సింగరేణి కాలరీస్ సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు  దసరా కానుకగా అందించాలని నిర్ణయించిన‌ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, అత్యంత ఎక్కువ మొత్తంలో దసరా బోనస్ అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఈ ఏడాది అర్హులైన సింగరేణి కార్మికులకు 368 కోట్ల రూపాయలను అందించనుండటం గొప్ప విషయమన్నారు. కార్మికుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ మరింత ముందుకు సాగుతూ, దేశానికి వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. 


సింగరేణిలో సంబరాలు


సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికుల కు  వాటా ప్రకటించడంతో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఒక శాతం పెంచి 30% బోనస్ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హేళన చేసిన జాతీయ కార్మిక సంఘాలకు చెంపపెట్టుగా దసరాకు ముందుగానే ఒక శాతం బోనసులు పెంచి సుమారు 368 కోట్ల లాభాలను ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని టిబిజికెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య అన్నారు. లాభాల వాటా ప్రకటనకు  సహకరించిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యే లతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.