తెలంగాణ సీఎం కేసీఆర్ పంటలు పండిస్తే ఉరి అని చెప్పడం సమంజసం కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. రెండు జీవనదులు, గతంలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా పంటలు సాగవుతున్నాయని పేర్కొన్నారు. పంటలు మార్కెటింగ్ చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం వద్దు అంది కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనను అనడం సరికాదని హితవు పలికారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ధాన్యం ఎలా కొన్నారో.. ఇప్పుడు కూడా అలాగే కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఆందోళనలో ఉన్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలన్నారు. దళితబంధు పథకంపై కొన్ని సందేహాలు ఉన్నాయని, దానిపై కూడా స్పష్టతను ఇవ్వాలని కోరారు. 119 నియోజకవర్గాల పరిధిలో దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తంగా 17 లక్షల కుటుంబాలకు రూ.1.7 లక్షల కోట్లు అవసరం అవుతాయని, ఏయే సంవత్సరం ఎంత ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఈ రూ.10 లక్షలను రుణంగా ఇస్తున్నారా లేదా పూర్తి సబ్సిడీగా ఇస్తున్నారా, దీనిపై రెండు మూడు రకాల వ్యాపారాలు చేసుకోవచ్చా అని సందేహం వెలిబుచ్చారు. ఈ సందేహాలపై అవసరమైతే అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పంజాగుట్టలో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఎంతోమంది పేద విద్యార్థులు చదువుతున్నారని, పాల ఉత్పత్తిని పెంచి వారికి ప్రతిరోజూ గ్లాసు పాలు అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. డెయిరీ ఇండస్ట్రీకి పెద్ద పీట వేయడం ద్వారా అటు ఉత్పత్తిని, ఇటు డిమాండ్ ను పెంచవచ్చని దీంతో ఎంతోమందికి ఉపాధి కూడా లభిస్తుందన్నారు. రోజురోజుకూ విస్తరిస్తున్న ఐటీ రంగానికి, గ్రామీణ ప్రాంతాల్లో బీటెక్ చదివే విద్యార్థులను అనుసంధానం చేసే విధానాన్ని కూడా రూపొందించాలని కోరారు.
Also Read: Bandi Vs KTR : రాజీనామాకు సిద్ధమా..? కేటీఆర్ - బండి సంజయ్ పరస్పర సవాళ్లు !
Also Read: Met Gala 2021: 'మెట్ గాలా'లో హైదరాబాదీ మెరుపులు.. రెడ్ కార్పెట్‌పై బిలియనీర్ సుధా రెడ్డి హొయలు