'మెట్ గాలా' సందడి మొదలైపోయింది. అందాల భామలు అదిరేటి డ్రెస్సుల్లో మెరుస్తూ రెడ్ కార్పెట్‌పై వయ్యారాలు ఒలకబోస్తూ ప్రేక్షకులను మైమరపింపజేశారు. సినీతారల తళుకులతో 'మెట్ గాలా' వేదిక కలర్ ఫుల్‌గా మారిపోయింది. అయితే ఆ తారల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు హైదరాబాదీ సుధా రెడ్డి. ఈసారి గ్రాండ్ ఈవెంట్‌లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక వ్యక్తి సుధా రెడ్డి మాత్రమే.


ఎవరో తెలుసా?


హైదరాబాద్‌కు చెందిన ఓ బిలియనీర్, వ్యాపారవేత్త భార్య సుధారెడ్డి. ఫ్యాషన్‌పై ప్రత్యేక మక్కువ ఉన్న సుధారెడ్డి తొలిసారి ప్రపంచస్థాయి ఫ్యాషన్ మీట్ 'మెట్ గాలా' ఎర్రతివాచీపై తళుక్కుమన్నారు. హొయలొలికిస్తూ అక్కడున్నవారిని కనువిందు చేశారు. 



ప్రత్యేక గౌనులో..


సుధారెడ్డి వేసుకున్న గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెటాలిక్ గోల్డ్ బాడీతో, మెరుస్తోన్న క్రిస్టల్స్‌తో డిజైన్ చేసిన గౌనులో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. డిజైన‌ర్ జోడీ ఫాల్గుని, షేన్ పీకాక్ ఈ గౌనును తయారు చేశారు. ఇది డిజైన్ చేయడానికి సుమారు 250 గంట‌ల స‌మ‌యం ప‌ట్టిన‌ట్లు డిజైనర్లు తెలిపారు. ఇక డిజైన‌ర్ ఫ‌రా ఖాన్ చేసిన డ్రీమీ డెకాడెన్స్ జువెల‌రీని సుధారెడ్డి ధ‌రించారు.






తెలుగు అందం..


ఆర్ట్‌, ఫ్యాష‌న్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని సుధారెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఇలా తొలిసారి ఓ అంత‌ర్జాతీయ వేదిక‌పై ఆమె క‌నిపించ‌డం విశేషం.


ఇంతకుముందు భారత్ నుంచి ప్రియాంక చోప్రా, దీపికా ప‌దుకొణే, ఇషా అంబానీలాంటి వాళ్లు మెట్ గాలాలో తమ అందచందాలతో సంద‌డి చేశారు. కానీ తొలిసారి ఓ హైదారాబాదీ 'మెట్ గాలా' లో కనువిందు చేయడం గొప్ప విషయం.


మెట్ గాలా..


'మెట్ గాలా'ను మెట్ బాల్ అని కూడా పిలుస్తారు. ఈ ఈవెంట్ గ్లామర్ కోసమో లేక అవార్డుల కోసమో నిర్వహించేది కాదు. ఇదో ఫండ్ రైజింగ్ ఈవెంట్.


న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ కోసం నిధుల సమీకరణలో భాగంగా ప్రతి ఏడాది 'మే'లో 'మొదటి సోమవారం' ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది మే లో జరగాల్సిన ఈ ఈవెంట్ కరోనా కారణంగా ఇప్పటివరకు వాయిదా పడింది.