ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సై అంటోంది. ప్రత్యామ్నాయ జెర్సీ, కిట్‌ను ఆవిష్కరించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కిట్ వివరాలను పంచుకొంది. ఏటా ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ప్రత్యామ్నాయ కిట్ ఈ సారి నీలి రంగుకు మారడమే అసలైన ట్విస్టు!
సాధారణంగా ఆర్‌సీబీ ఎరుపు, నలుపు, బంగారు వర్ణం కిట్‌ను ఉపయోగిస్తుంది. సీజన్‌లో ఒక మ్యాచులో మాత్రం ఆకుపచ్చ జెర్సీ కిట్‌ను ఉపయోగిస్తుంది. పర్యావరణం, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా చేస్తుంది. ఈ సారి మాత్రం పచ్చరంగు బదులు నీలం రంగు కిట్‌ను రూపొందించింది. కొవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఎంతగా సంక్షోభం వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ మహమ్మారి నుంచి రక్షించేందుకు వైద్యులు సహా ఎంతో మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు రాత్రి పగలూ పనిచేశారు. వారిని గౌరవించేందుకే ఆర్‌సీబీ ఈసారి నీలి రంగు కిట్‌ను ఎంపిక చేసుకుంది.
సెప్టెంబర్ 20న ఆర్‌సీబీ ఐపీఎల్ రెండో దశలో మొదటి మ్యాచ్ ఆడనుంది. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచుకు ఆర్‌సీబీ నీలిరంగు జెర్సీ ధరించనుంది. ఐపీఎల్ మొదటి దశ సమయంలోనే తొలి వరుస యోధులను ప్రత్యేకంగా గౌరవిస్తామని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బెంగళూరు నగరం సహా దేశ వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం తమ ఫ్రాంచైచీ తరపు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించడం గమనార్హం.
Also Read: Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్ తర్వాత.. పరిమిత ఓవర్ల ఫార్మట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..
కరోనా మహమ్మారిపై పోరాటం కోసం 'గివ్ ఇండియా ఫౌండేషన్'తో ఆర్‌సీబీ చేతులు కలిపింది. కొవిడ్ ఆరంభం నుంచి బెంగళూరు నగర వ్యాప్తంగా ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను ఇస్తోంది. ఇప్పటికే ఆర్‌సీబీ మాతృసంస్థ డియాగో ఇండియా 3 లక్షల లీటర్ల సానిటైజర్లను పంచింది. వైద్య రంగం కోసం రూ.75 కోట్లను కేటాయించడం గమనార్హం.
Also Read: Hiring sentiment improves: పండగల వేళ ఉద్యోగ నియామకాల హేళ..! పెరగనున్న జీతాలు..!