ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను మరోసారి గెలిచేందుకు ముంబయి ఇండియన్స్‌కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు. యూఏఈ పిచ్‌లకు అవసరమైన అన్ని వనరులు ఆ జట్టుకు ఉన్నాయని తెలిపాడు. ఐపీఎల్ రెండో దశలో ఆ జట్టు వరుస విజయాలు సాధించే అవకాశం ఉందటున్నాడు.
యూఏఈ పిచ్‌లు, పరిస్థితులు ముంబయి ఇండియన్స్ పేసర్లకు అనుకూలిస్తాయని గంభీర్ అంటున్నాడు 'ఐపీఎల్ మొదటి దశలో ముంబయి ఇండియన్స్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. సాధారణంగా ఆడే పిచ్‌లకు భిన్నమైన వికెట్లపై ఆడారు. ఎందుకంటే వాంఖడేతో పోలిస్తే చెపాక్, దిల్లీ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వారు తమకు అలవాటైన పరిస్థితుల్లో ఆడనున్నారు. యూఏఈ పిచ్‌లు ముంబయి ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్‌బౌల్ట్‌కు నప్పుతాయి' అని గంభీర్ అన్నాడు.
'యూఏఈలో బంతి స్వింగ్ అవుతుంది. కాబట్టి ముంబయి పేసర్లను ఎదుర్కోవడం కష్టం. నాణ్యమైన పేసర్లు ఉండటంతో ముంబయి సైతం బంతి స్వింగ్ అవ్వాలనే కోరుకుంటుంది. అది వాళ్లకు ఉపయోగం. అంతేకాకుండా వారి బ్యాటర్లు బంతి బ్యాటుపైకి రావాలని కోరుకుంటారు. రోహిత్, హార్దిక్ పాండ్య వంటి బ్యాటర్లు చెపాక్‌లో ఇబ్బంది పడటం గమనించాం. ఎందుకంటే బంతి అక్కడ విపరీతంగా టర్న్ అవుతుంది' అని గౌతీ పేర్కొన్నాడు.
'దుబాయ్, అబుదాబిలో ముంబయి బ్యాటర్లు ఇబ్బంది పడరు. అందుకే ముంబయికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాను. ఆలస్యంగా విజయాలు సాధించాలని వారనుకోరు. ఎందుకంటే ఉన్నది ఏడు మ్యాచులే. పైగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే వారు కనీసం ఐదు మ్యాచులు గెలవాలి. అందుకే నిదానంగా ఆడే పరిస్థితి వారికి లేదు' అని గంభీర్ వెల్లడించాడు.
ఐపీఎల్ రెండో దశలో తొలి మ్యాచులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ముంబయి ఢీకొట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచు కోసం ముంబయి ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే యూఏఈలోని శిబిరంలో కఠిన సాధన చేస్తోంది. లండన్ నుంచి శిబిరానికి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో అడుగుపెట్టాడు. కసరత్తులు చేస్తున్నాడు. జట్టులో జోష్ నింపాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను ముంబయి సోషల్ మీడియాలో పంచుకుంది.
Also Read: IPL Auction Date: పది జట్ల ఐపీఎల్‌కు అంకురార్పణ.. అక్టోబర్ 17నే ఫ్రాంచైజీల వేలం!