మెరుపువేగంతో బంతులు విసురుతూ బ్యాట్స్ మెన్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే శ్రీలంక పేస్ బౌలర్ ల‌సిత్ మ‌లింగ్ బంతిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడు. 2011లో టెస్టుల నుంచి, 2019లో వ‌న్డేల నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఈ ఫాస్ట్ బౌల‌ర్ ఇప్పుడు క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేశాడు. మ‌లింగ్ కెరీర్ పీక్ టైంలో ఉన్న‌ప్పుడు యార్క‌ర్ వేశాడంటే వికెట్ ప‌డిన‌ట్లే.


ముంబై ఇండియ‌న్స్ రిలీజ్ చేసిన అనంత‌రం  ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా మ‌లింగ్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్లో మ‌లింగ రికార్డు ఎంతో ఘ‌నంగా ఉంది. 19.68 స‌గ‌టు, 7.07 ఎకాన‌మీ రేటు, 16.60 స్ట్రైక్ రేట్ తో మొత్తం 107 వికెట్ల‌ను మ‌లింగ తీశాడు.


అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్లో వంద వికెట్ల‌ను తీసిన మొద‌టి బౌల‌ర్ మ‌లింగ‌నే కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా అత్య‌ధిక టీ20 వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో డ్వేన్ బ్రేవో, ఇమ్రాన్ తాహిర్, సునీల్ న‌రైన్ ల త‌ర్వాత నాలుగో స్థానంలో మ‌లింగ ఉన్నాడు.


బ్యాట్స్ మ‌న్ కాళ్ల‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసే మ‌లింగ ఒక‌ప్పుడు ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ డెత్ బౌల‌ర్. మ‌లింగ అంత‌ర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాక యార్క‌ర్ల‌కు ప్రాముఖ్య‌త పెరిగింది. ఇప్పుడు టీ20లు అయినా, వ‌న్డేలు అయినా.. డెత్ ఓవ‌ర్ల‌లో యార్క‌ర్లు వేయ‌గ‌ల బౌల‌ర్ల‌కే జ‌ట్లు పెద్ద‌పీట వేస్తున్నాయి. 2013 ఐపీఎల్ ఫైనల్లో వైడ్ యార్క‌ర్ల‌తో ధోనిని అడ్డుకున్న తీరు మ‌ర్చిపోవ‌డం క‌ష్ట‌మే. అలా ముంబై తొలి ఐపీఎల్ క‌ప్ విజ‌యంలో కూడా మలింగ కీల‌క పాత్ర పోషించాడు.


"ఈరోజు నాకు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. నా టీ20 కెరీర్ లో నాకు సాయంగా ఉన్న వారంద‌రికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా టీ20 బౌలింగ్ షూల‌కు పూర్తిస్థాయిలో విశ్రాంతిని ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాను. శ్రీలంక క్రికెట్ బోర్డు, ముంబై ఇండియ‌న్స్, మెల్ బోర్న్ స్టార్స్, కెంట్ క్రికెట్ క్ల‌బ్, రంగ్ పూర్ రైడ‌ర్స్, గ‌యానా వారియ‌ర్స్, మ‌రాఠా వారియ‌ర్స్, మాంట్రియ‌ల్ టైగ‌ర్స్ జ‌ట్ల‌కు కృతజ్ఞతలు.


ఫ్రాంచైజీ క్రికెట్, జాతీయ జ‌ట్టుకు ఆడాల‌నుకునే యువ క్రికెట‌ర్ల‌కు నా అనుభవాల‌ను పంచాల‌నుకుంటున్నాను. నా పాదాలు విశ్రాంతి తీసుకున్నా.. ఆటపై నాకున్న ప్రేమ న‌న్ను విశ్రాంతి తీసుకోనివ్వ‌దు. యువ‌కులు చ‌రిత్ర సృష్టించడం చూడాల‌నుకుంటున్నాను" అని మ‌లింగ ఈ సంద‌ర్భంగా తెలిపారు.


టీ20 బౌల‌ర్ల‌లోని దిగ్గ‌జాల్లో మ‌లింగ క‌చ్చితంగా స్థానానికి అర్హుడే. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, క‌రీబియ‌న్ ప్రీమియర్ లీగ్, ఇత‌ర ఫ్రాంచైజీ జ‌ట్లు విజ‌య‌వంతం కావ‌డంలో మ‌లింగ పాత్ర ఎంతో ఉంది. ముంబై ఇండియ‌న్స్ ఐదుసార్లు ఐపీఎల్ సాధిస్తే.. అందులో నాలుగు సార్లు మ‌లింగ జ‌ట్టులోనే ఉన్నాడు.


మ‌లింగ విల‌క్ష‌ణ‌మైన బౌలింగ్ స్టైల్ కు ఎంద‌రో అభిమానులు ఉన్నారు. ఆ బౌలింగ్ ను కొంత‌మంది బౌల‌ర్లు అనుక‌రించారు కూడా. భార‌తీయ యువ‌త మీద కూడా మ‌లింగ్ బౌలింగ్ శైలి ఎంతో ప్ర‌భావం ఉంది. గ‌ల్లీ క్రికెట్ ఆడే యువ‌కుల్లో కూడా ఎంతోమంది అత‌ని బౌలింగ్ స‌ర‌ళిని క‌చ్చితంగా అనుక‌రించే ఉంటారు. అంత అద్భుత‌మైన ఘ‌న‌త‌లు సాధించిన మ‌లింగ్ త‌న ప‌రిగెత్తే కాళ్ల‌కు, బంతిని విసిరే చేతుల‌కు విశ్రాంతిని ఇచ్చాడు.


Also Read: IPL 2021: యూఏఈలో ముంబయి ఇండియన్స్‌ ఎందుకు గెలవగలదంటే..? గౌతీ వివరణ ఇదీ


Also Read: IPL Auction Date: పది జట్ల ఐపీఎల్‌కు అంకురార్పణ.. అక్టోబర్‌ 17నే ఫ్రాంచైజీల వేలం!


Also Read: IPL 2021: ఎరుపు రంగు నుంచి నీలి రంగు జెర్సీకి మారిన ఆర్‌సీబీ.. ఎందుకో తెలుసా?