భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో... మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గాల మధ్య ఆదిపత్య పోరు చల్లారడం లేదు. బతుకమ్మ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా  ఎదురెదురుగా రావడంతో  ఇరువర్గాల వారూ బాహాబాహీకి దిగారు.  అడ్డుకోబోయిన ట్రైనీ ఎస్సై కార్తీక్ పై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులకు లాఠీఛార్జి చేయక తప్పలేదు.


జూలూరుపాడు మండలానికి చెందిన ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గానికి- మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గానికి గత కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. విభేదాలను విడనాడి ఒకటిగా కలిసి పని చేసుకోవాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు గతంలో సూచించారు. అందరం కలిసి కట్టుగా  ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పారు. ఇరువురి నాయకుల మధ్య ఐక్యత ఏర్పడితే నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని నామా నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత  మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గానికి చెందిన మండలం ముఖ్య నాయకులను  పార్టీ నుంచి సస్పెండ్  చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య మరింత నిప్పురాజుకుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు బతుకమ్మ ఊరేగింపులో మరోసారి వర్గపోరు వెలుగుచూసింది.


రాములు నాయక్ మొదటి నుంచి రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తి కాదు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పాలిటిక్స్ లో అడుగు పెట్టారు. 2018 ఎన్నికల్లో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. ఈ విజయం కేవలం రాములు నాయక్ ది కాదని ఆయన వెనక అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని చెబుతారు. అప్పట్లో పొంగులేటి హవా కొనసాగుతున్నప్పుడు రాములు నాయక్ వెంట నిలబడి మరీ  గెలిపించారని అంటారు. ఆ విధంగా.. రాములు నాయక్ అంటే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషి అనే ప్రచారం సాగింది.  ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములును.. పొంగులేటి స్వయంగా వెంటబెట్టుకెళ్లి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేర్పించారు. అప్పటి నుంచీ రాములునయాక్-మదన్ లాల్ వర్గీయుల మధ్య ఆదిపత్య పోరు సాగుతూనే ఉంది. 


Also Read: మసీదులో బాంబు పేలుడు.. 32 మంది మృతి!
Also Read: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!
Also Read: కామెడీ పెట్ ఫొటో అవార్డ్స్ 2021 ఫైనల్‌కి అర్హత సాధించిన ఫొటోలు... చూస్తే వావ్ అనాల్సిందే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి