Tamilisai Slams Trollers : తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గవర్నర్‌ను బాడీ షేమ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ట్రోల్స్‌పై మౌనంగా ఉన్న తాజాగా వీటిపై స్పందించారు. ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై, తన శరీర రంగుపై ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది నాకు బట్టతల అని విమర్శిస్తున్నారు. నన్ను ట్రోల్ చేస్తున్న వారందరికీ నేను నిప్పులా మారి కాల్చివేస్తాను అంటూ గవర్నర్ తమిళిసై వార్నింగ్ ఇచ్చారు. ఈ ట్రోలర్స్ నోళ్లు మూసుకుని సైలెంట్ అయ్యేంత ఎత్తుకు చేరుకుంటానన్నారు.  


సోషల్ మీడియా ట్రోల్ పై వార్నింగ్ 


తమిళనాడులోని ఓ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళి సై తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. నల్లగా ఉన్నారని, పొట్టిగా ఉన్నారని, బట్టతల అని ఎలా పడితే అలా తనను సోషల్ మీడియాతో ట్రోల్ చేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని తెలిపారు. సోషల్ మీడియాలో చాలాసార్లు ఇష్టారీతిన  కామెంట్స్ చేస్తున్నారన్నారు.  ఇవి బాడీ షేమింగ్‌ అన్నారు. ఓ మహిళపై కక్షపూరితంగా కొందరు శాడిస్టులు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నా రంగు, ఎత్తు గురించి హేళన చేస్తున్నారన్న గవర్నర్... ఇంకోసారి ఇలా కామెంట్స్ చేస్తే అగ్గిరవ్వనై దహించేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై హేళనగా వ్యాఖ్యలు చేస్తున్న వారికి అందనంత ఉన్నతస్థానానికి ఎదుగుతానన్నారు. 


చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ 


తమిళనాడులో పర్యటిస్తున్న గవర్నర్ తమిళిసై.. చెన్నైలోని తాండయార్‌పేటలోని ఓ బాలికల ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్నారు. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు తమిళి సై ప్రయత్నించారు. అందులో భాగంగా సోషల్ మీడియాతో తాను ఎదుర్కొన్న పరిస్థితులను విద్యార్థులకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఎట్టిపరిస్థితిలో హేళనలకు తలొగ్గొద్దని అగ్గిరవ్వలా మారాలని విద్యార్థినిలకు సూచించారు.  గవర్నర్ తమిళిసై పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తనపై అభ్యంతరకరంగా కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోనని సోషల్ మీడియా ట్రోలర్స్ కు గట్టి హెచ్చరిక జారీచేశారు. నన్ను ఆకతాయి అని పిలిస్తే, నేను నిప్పుకణంగా మారతానని ట్రోల్స్ పై మండిపడ్డారు.  


జుట్టు, శరీర రంగు ముఖ్యం కాదు


 గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శరీర ఛాయపై ఎవరు ట్రోల్ చేశారనే ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే స్కూల్ ఈవెంట్ లో మాట్లాడిన గవర్నర్ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి శరీర రంగు, జుట్టు ముఖ్యం కాదని, కొండంత ఆత్మవిశ్వాసం చాలని విద్యార్థులను మోటివేట్ చేశారు. గతంలో నాని శ్యామ్ సింగరాయ్ లో సాయిపల్లవి చేసిన దేవదాసి పాత్రలో తను అందంగా లేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. దీనిపై అప్పట్లో గవర్నర్ తమిళిసై స్పందించారు. సాయిపల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. తాను కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పారు. శ్రమ, ప్రతిభతో వాటిని ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశారు.