Vande Bharath: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలు విడి భాగాలను శ్రీసిటీలోని బీఎఫ్జీ అనే సంస్థ తయారు చేస్తోంది. బీఎఫ్జీ సంస్థ 2009వ సంవత్సరం నుంచి నిర్మాణ, రవాణా, పవన విద్యుత్ వంటి రంగాల్లోని పరిశ్రమలకు విడిభాగాలను అందిస్తోంది. మెట్రో కోచ్ ల తయారీ సంస్థలు అయిన బొంబార్డియర్, వోల్వో, ఆల్ స్తోమ్ తో పాటు ఇండియన్ రైల్వేస్, జనరల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, కొచ్చిన్ షిప్ యార్డు, గమేశ, థెర్మాక్స్, ఎంసీఎఫ్, బెచ్ టెల్ వంటి వివిధ సంస్థలు దీని సేవలను అందుకుంటున్నాయి.
10 నెలల్లోనే ఆర్డరు పూర్తి
సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలులోని ఇంటీరియర్, టాయిలెట్ క్యాబిన్, ఇంజిన్ ముందు భాగాన్ని బీఎఫ్జీ సంస్థ తయారు చేసి అందిస్తోంది. ఒక్కో వందే భారత్ రైలు కోసం 329 రకాల ఫైబర్ రీ ఇన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్ ప్యానెళ్లను తయారు చేసి ఇస్తోంది. ఆర్డరు ఇచ్చినప్పటి నుండి కేవలం 10 నెలల్లో బీఎఫ్జీ పూర్తి చేసింది. ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి వివిధ రంగుల ప్యానెళ్లను ఈ కంపెనీ తయారు చేసింది.
బీఎఫ్జీ ఇంకా ఎన్నిట్లోనో
దిల్లీ మెట్రో రోలింగ్ స్టాక్ (కోచెస్) కోసం బొంబార్డియర్ ట్రాన్స్ పోర్టేషన్ లో దాని వ్యూహాత్మక సరఫరా దారుగా ఉంటోంది బీఎఫ్జీ సంస్థ. లోపలి, ముందు, వెనక భాగాలతో పాటు డ్రైవర్ క్యాబ్ లు, ఎఫ్ఆర్పీ విడిభాగాలను సైతం బీఎఫ్జీ ఇండియా తయారు చేస్తోంది. చెన్నై, కొచ్చి, మెట్రో ప్రాజెక్టుల మెట్రో రోలింగ్ స్టాక్ కోసం సైడ్ వాల్స్, సెంట్రల్ సీలింగ్ లు, లేటరల్ సీలింగ్ లు, గ్యాంగ్ వే విభజనలు, క్యాబ్ విభజనలతో సహా వివిధ భాగాలను శ్రీ సిటీలోని ఆల్ స్టోమ్ ఇండియాకు బీఎఫ్జీ సరఫరా చేస్తోంది.
విమానం లాంటి ప్రయాణ అనుభూతి
ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. ఈ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతా ప్రయాణిస్తాయి. ఇందులో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ముఖ్యంగా కవచ్ టెక్నాలజీ. రైళ్లు పరస్పరం ఢీ కొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. సాంకేతిక తప్పిదం వల్ల రైళ్లు ఒకే ట్రాక్ పై వస్తే వాటి మధ్య కిలో మీటరు దూరం ఉండగానే.. ఈ వ్యవస్థ హెచ్చరికలు చేస్తుంది. రైలు వేగాన్ని ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది.
తక్కువ టైంలోనే ఫుల్ స్పీడ్
వందే భారత్ రైళ్లు కేవలం 140 సెకన్ల సమయంలో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. అంత వేగంలోనూ కదుపులు లేకుండా ప్రయాణం సాగుతుంది. ఎయిర్ కండిషన్ కోసం ప్రతి కోచ్ కు కోచ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టం ఉంటుంది. ఆటో మేటిక్ డోర్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్ లలో సీట్లు 360 డిగ్రీల్లో తిరుగుతుంటాయి. పెద్ద గాజు అద్దాల నుండి ప్రకృతి అందాలను చూస్తూ జర్నీని ఎంజాయ్ చేయవచ్చు.