Hyderaba Crime News: హైదరాబాద్ పంజాగుట్టలో అర్ధరాత్రి పలువురు యువకులు నానా హంగామా చేశారు. దాదాపు 15 మంది యువకులు కారులో వెళ్లి ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. విషయం గుర్తించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యువకుడిపై దాడి జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే..?


ఖమ్మంకు చెందిన ఇస్లావత్ జయరామ్ నార్సింగ్ లో నివాసం ఉంటున్నారు. ఖమ్మంలో ఇతను ఉండే ఏరియాలోనే దేవరగట్టు శ్రీరామ్ అలియా శ్రీధర్ ఉంటాడు. వీరిద్దరికీ పడదు. తరచుగా గొడవలు జరుగుతుంటాయి. గత ఆరు నెలల క్రితం గుజరాత్ లో శ్రీరామ్ ను మనుషులను పెట్టి జయరామ్ కొట్టించాడు. దీంతో కక్ష పెంచుకున్న శ్రీరామ్ ఎప్పుడు ఛాన్స్ దొరికినా జయరామ్ అంతం చూడాలనుకున్నాడు. శనివారం రాత్రి శ్రీరామ్ జయరామ్ కు ఫోన్ చేసి అమీర్ పేట వద్ద ఉన్నాను.. దమ్ముంటే ఇక్కడకు రా అంటూ ఛాలెంజ్ విసిరాడు. దీంతో పంజాగుట్ట ప్రాంతంలోనే ఉన్న జయరామ్ భయపడి అతని స్నేహితులు కౌశిష్, అభిలాష్ లను పిలిపించుకొని ముగ్గురూ కలిసి యాక్టివా తీసుకొని పంజాగుట్ట పెట్రోమాల్ ముందునుంచి వెళ్తున్నారు. వీళ్లు ఇక్కడ ఉన్నట్లు తెలుసుకున్న శ్రీరామ్ అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో 15 మందితో కలిసి కార్లలో వచ్చి జయరామ్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. 


స్థానికులు ఎంత అడ్డగించినా వినకపోవడంతో జయరామ్ స్నేహితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీస్ పెట్రోకార్‌లో అక్కడకు వెళ్లారు. అప్పటికే జయరామ్ చితకబాదిన శ్రీరామ్‌ అండ్‌ గ్యాంగ్‌... అతన్ని కారులో ఎక్కించి కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. ఇంతలో పోలీసులు రాక గమనించిన శ్రీరామ్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. జయరామ్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందించారు. అతని నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 


రెండు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. లంగర్‌హౌస్‌లో గ్యాంగ్‌వార్ పడిగ విప్పింది. లంగర్‌హౌస్‌ లో ఉండే ఇర్ఫాన్ అనే ఓ యువకుడిని ముగ్గురు నిందితులు కిడ్నాప్ చేశారు. అనంతరం రాజేంద్ర నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అతడి బట్టలన్నీ తీసేసి నగ్నంగా మార్చి ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారు. వద్దు భయ్యా, వద్దు భయ్యా అంటున్నా వినకుండా విపరీతంగా కొట్టారు. అంతేకాకుండా ఈ రాక్షస క్రీడను వీడియో తీశారు. అనంతరం వాటిని వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకున్నారు. తమ మాట వినకుంటే అందరి గతి ఇంతేనంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.


ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న ఇర్ఫాన్.. రాజేంద్ర నగర్ పోలీసులు ఆశ్రయించాడు. అయితే ఈ దాడి ఘటనలో ఇర్ఫాన్ ఒళ్లంతా వాతలు వచ్చాయి. వాటిని ఇర్ఫాన్ పోలీసులకు చూపించాడు. అతడిని చితక బాదినప్పుడు తీసిన వీడియోలు, వారు పెట్టిన స్టేటస్ లను కూడా పోలీసులకు చూపించాడు. తనను కిడ్నాప్ చేసి అనుక్షణం నరకం చూపించిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇర్ఫాన్ ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులతో చికిత్స ఇప్పించిన తర్వాత ఇంజురీ సర్టిఫికేట్ ను కూడా తీసుకొని.. ఇర్ఫాన్ ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు.