ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మారే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులనే చూశాం.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అసంతృప్తులు బయటకు వస్తున్నారు.
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ పార్టీ మారుతున్నారు. ఆయన సైకిల్ దిగి.. ఫ్యాన్ గూటికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం జగన్‌తో సమావేశమై పార్టీ కండువా కప్పుకోనున్నారు.
కైకలూరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న జయమంగళ వెంకట రమణ చాలా కాలం నుంచి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని టాక్. అవకాశం కోసం చూస్తున్న ఆయనకు వైసీపీ ఆఫర్ ప్రకటించిందని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పడంతో వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారని సమాచారం.
వెంకటరమణ పార్టీలోకి తీసుకురావడంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇప్పుడు ఏపీలో వచ్చే నెలలో ఖాళీలు అయ్యే స్థానాలతో కలుపుకొని మొత్తం పద్నాలు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందలో ఒకటి వెంకటరమణకు ఇవ్వబోతున్నట్టు వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
వెంకటరమణ పని తీరు బాగాలేదని.. అందుకే ఆయన్ని కైకలూరు స్థానం నుంచి తప్పించి వేరే వాళ్లకు అవకాశం ఇస్తారని ఎప్పటి నుంచో టీడీపీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వెంకట రమణ పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది.
జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటిసి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నియోజకవర్గం గెలిచి తొలిసారి ఎమ్మెల్యేఅయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా టికెట్ ఇవ్వలేదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలంగా కనిపించడం లేదు.