Nellore Crime : నెల్లూరులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి చొరబడి, తండ్రీ కూతుళ్ల చేతులు కట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన నెల్లూరులో సంచలనం అయింది. నెల్లూరు నగరంలో సోమవారం తెల్లవారు జామున దొంగలు హల్ చల్ చేశారు. నెల్లూరు సిటీలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు... నిద్రపోతున్న తండ్రీ కూతుళ్ల చేతులు కట్టేసి, వారిని బెదిరించి నగలు, నగదు దోచుకెళ్లారు. పదిన్నర సవర్ల నగలు, 50 వేల రూపాయల నగదు దోచుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీపే కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 


కట్టేసి చోరీ


"నలుగురు ముసుగుల్లో వచ్చి చోరీ చేశారని బాధితులు చెబుతున్నారు. క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ కూడా వచ్చింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సీసీకెమెరాలు ఉన్నాయని కానీ పనిచేయడంలేదు. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. బాధితులను నిర్బంధించి దొంగతనం చేశారు. ఎస్పీ ఆదేశాలతో కేసు విచారణ చేపట్టాం. త్వరలోని నిందితులను పట్టుకుంటాం" - పోలీసులు 


 జల్సాలకు అలవాటుపడి చోరీలు 


కోనసీమ జిల్లాలో జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు దొంగతనాన్ని వృత్తిగా చేసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి తెలిపారు. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏడు చోరీలకు సంబంధించి అమలాపురం తాలూకా పోలీసులు, అమలాపురం పట్టణ కైమ్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టి ఈ కేసులను ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు లక్షల 49 రూపాయల విలువ గల నగదు, మోటార్ బైకులు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వై మాధవరెడ్డి మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో బట్నవెల్లి గ్రామానికి చెందిన కన్ని పాముల శివశంకర్, ఇళ్ల సతీష్, కన్నపాముల నాగ ప్రసాదులను అరెస్టు చేశామన్నారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.  


ప్రయాణికులే టార్గెట్


జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు బస్‌ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇలా పలు చోట్ల సెల్‌ఫోన్లు, బైక్‌లు దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికారు. గత కొన్ని రోజులుగా  ఇద్దరు వ్యక్తులపై నిఘా పెట్టి పోలీసులు చివరకు వలపన్ని పట్టుకున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో అరెస్ట్‌ చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. తుని ప్రాంతానికి చెందిన బోదల అప్పారావు అనే వక్తిని, విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు చెందిన బోదల సురేష్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. మొదటి కేసులో నిందితుడు అప్పారావుపై తుని పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే సస్పెక్టడ్‌ షీట్‌ కూడా ఉంది. సారా అమ్మడంతోపాటు బైక్‌, సెల్‌ఫోన్లు దొంగతనాలు చేస్తున్నాడని గుర్తించి ఇతనిపై నిఘా ఉంచామని తెలిపారు. సురేష్‌ అనే వ్యక్తి అన్నవరం పరిసర ప్రాంతాల్లో రూమ్‌ తీసుకుని రాత్రిపూట బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌ల్లో తిరుగుతూ అదేవిధంగా రైలులో నిద్రపోతున్న ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లు దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. చోరీ చేసిన సొత్తును మద్యవర్తుల ద్వారా రీ సెట్టింగ్స్‌ చేయించి విక్రయిస్తున్నారని వెల్లడిరచారు. ఈ చోరీ చేస్తున్న సెల్‌ఫోన్లును పాస్‌వర్డ్‌లను తీయడం, ఇతర సాంకేతికంగా సహకరిస్తున్నవారిని, విక్రయిస్తున్నవారిని గుర్తించామని తెలిపారు. త్వరలోనే వారిని అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.