Case filed against ap deputy cm: సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఆయనపై కేసు నమోదు చేసినట్టు తాజాగా ప్రకటించారు. కాంగ్రెస్ నేత మల్లు రవి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలనుకుంటున్న వేళ.. వైసీపీని నేరుగా నేతలు టార్గెట్ చేయడం, ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 


నారాయణ స్వామి ఏమన్నారు..?
ఇటీవల షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ సందర్భంగా ఏపీలో వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వయానా సీఎం జగన్.. కుటుంబాలను చీలుస్తున్నారని కూడా మాట్లాడారు. అదే సమయంలో వైఎస్ఆర్ మరణంపై కూడా కొన్ని కామెంట్లు వినిపించాయి. ఈ వ్యాఖ్యల పరంపరలో నారాయణ స్వామి ఇంకాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. నేరుగా సోనియాని దోషిగా చిత్రీకరిస్తూ ఆయన మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు. అక్కడితో ఆగకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కంప్లయింట్ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి. దీంతో వ్యవహారం మరింత ముదిరింది. 


మరోసారి సీరియస్ కామెంట్స్..
తెలంగాణ నేతలు తనపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారన్న విషయం తెలిసిన తర్వాత నారాయణ స్వామి మరింత ఘాటుగా స్పందించారు. సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్‌ ప్రమాదంలో చంపారనే సందేహం ఏపీ ప్రజల్లో ఉందన్నారు. వారిద్దరూ వైఎస్ఆర్ ను చంపారని ప్రజలందరికి తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియాగాంధీకి కానీ, చంద్రబాబుకు కానీ లేదన్నారు నారాయణ స్వామి. చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తిని సోనియాగాంధీ తో కలసి చంద్రబాబు హింసించారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వారిద్దరూ పొట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలుసన్నారు. ఏ తప్పూ చేయని జగన్ ని, ఎవరికీ భయపడని జగన్ ని.. అన్యాయంగా కేసుల్లో ఇరికించారన్నారు. 16 నెలలు జైలులో పెట్టి హింసించారని ఆరోపించారు. అప్పుడు స్పందించని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడెందుకు తనపై కేసు పెట్టారని ప్రశ్నించారు నారాయణ స్వామి. 


నారాయణ స్వామి వ్యాఖ్యలపై తాజాగా కేసు నమోదు చేసినట్టు బేగంబజార్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు కావడం విశేషం. షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో.. ఏపీలో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరే బయటకొస్తున్నారు. గొంతు సవరించుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా మరోసారి సోనియా, కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై కేసులు నమోదయ్యే వరకు వ్యవహారం ముదరడంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.