Kashmiri Cricketer Aamir Hussain: సాధారణంగా ఎంతో మంది యువకులు తమకు అదృష్టం లేదని జీవితంలో ఎంత పని చేసినా ఫలితాలు రావడం లేదని.. ఇక తమ జీవితం ఇంతే అని నిస్పృహకు లోనవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే ఓ క్రికెటర్ సాగించిన అద్భుత ప్రయాణమిది. గెలవాలన్న పట్టుదల సాధించాలన్న సంకల్పం తానేంటో నిరూపించుకోవాలన్న కసితో క్రికెటర్ అమీర్ హుస్సేన్ (Cricketer Aamir Hussain) సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి మంత్రమైంది. మరెందరికో దిశా నిర్దేశం చేసింది. కష్టాలను ఎదిరించి.. కన్నీళ్లను దిగమింగి... ఆ క్రికెటర్ సాగించిన ప్రస్థానం. క్రికెట్ గాడ్ సచిన్(Sachin)ను కూడా విస్మయ పరిచింది.
కాలుతోనూ బౌలింగ్
క్రికెట్ ఆడాలంటే రెండు చేతులు కావాలి. బ్యాటింగ్ చేయాలన్నా.. బౌలింగ్ వేయాలన్నా చేతులు తప్పనిసరి. ఒక్క చేయి ఉన్నా కొంచెం కష్టంగా అయినా క్రికెట్ ఆడొచ్చు. మరి రెండు చేతులు లేకపోతే... క్రికెట్ ఆడడం అసాధ్యమని అనుకుంటున్నారు కదూ.. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు జమ్మకశ్మీర్‌కు చెందిన అమీర్ హుస్సేన్(Amir Hussain Lone). అతని సంకల్ప బలం ముందు విధి కూడా ఓడిపోయింది. అతని నిర్విరామ కృషి ముందు వైకల్యం మోకరిల్లింది. ఎనిమిదేళ్ల పసిప్రాయంలో విధి తన రెండు చేతులను తీసుకుపోయినా అతని సంకల్పం ముందు వైకల్యం కూడా చిన్నబోయింది.
కుంగిపోలేదు... నిలబడ్డాడు
ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో అమీర్ హుస్సేన్ రెండు చేతులూ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో అమీర్ కుంగిపోలేదు. నిరాశతో ఆగిపోలేదు. ఇక తన జీవితం వ్యర్థమని నిస్పృహకు లోను కాలేదు. తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను సాధన చేశాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్ పట్టుకుని..... బ్యాటింగ్ చేస్తున్నాడు. మంచి షాట్లు ఆడుతూ... డిఫెన్స్ ఆడుతూ రాణించాడు. అంతేనా.. కుడి కాలి వేళ్ల మధ్య బంతిని ఇరికించుకుని, కాలిని తిప్పి బౌలింగ్ వేసి ఔరా అనిపిస్తున్నాడు. అతనిలో ప్రతిభను ఓ ఉపాధ్యాయుడు గుర్తించి ప్రోత్సహించడంతో అమీర్ పారా క్రికెట్లోకి వచ్చాడు. 2013 నుంచి అమీర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పుడు జమ్ముకశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు 34 ఏళ్ల అమీరే కెప్టెన్. 2013, 2018లో జాతీయ టోర్నీలో ఆడాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ప్రాతినిథ్యం వహించాడు.
నేపాల్, షార్జా, దుబాయ్‌లోనూ అమీర్ హుస్సేన్ మ్యాచ్‌లాడాడు. సచిన్, కోహ్లీలను ఆరాధించే అమీర్ వీళ్లను కలవాలని కోరుకుంటున్నాడు. ప్రమాదం తర్వాత తాను నమ్మకాన్ని కోల్పోలేదని కాలితో బౌలింగ్ భుజం, మెడ సాయంతో బ్యాటింగ్ చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారని అన్నాడు. క్రికెట్ ఆడేలా శక్తినిచ్చిన దేవుడికి అమీర్ ధన్యవాదాలు తెలిపాడు. తన పేరుతో ఉన్న జెర్సీ వేసుకుని క్రికెట్ ఆడుతున్న అమీర్‌ను చూసి సచిన్ ముగ్దుడయ్యాడు. అమీర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడని కొనియాడాడు. క్రికెట్ పట్ల అతనికి ఉన్న ప్రేమ, అంకితభావం తనను ముగ్దున్ని చేసిందని సచిన్ మురిసిపోయాడు. అమీర్‌ను కలిసి అతని పేరుతో ఉన్న జెర్సీని తీసుకుంటానని సచిన్ అన్నాడు.