ఇంగ్లండ్‌(England) తో జరిగే ఐదు మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌ కోసం తొలి రెండు టెస్టులకు జట్టు... అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఈ ప్రకటన కొందరిని నిరాశ పరచగా ఇంకొందరిని ఆనందింపజేసింది. అయితే ఈ సారి వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా(South Africa)తో టెస్టు సిరీస్‌ నుంచి వైదొలిగిన ఇషాన్‌ కిషన్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌(Dhruv Jurel) కు కమిటీ అవకాశం కల్పించింది. అయితే  ఈ ధ్రువ్‌ జురెల్‌ ఎవ్వరన్న దానిపై అందరి దృష్టి పడింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాడిని టెస్ట్‌ సిరీస్‌కు ఎంపిక చేయడం ఆశ్చర్య పరిచింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా  ఆటతీరు మెరుగుపరచుకొని  తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవ్వడంపై ధ్రువ్‌ కూడా  భావోద్వేగంతో స్పందించాడు. తన కుటుంబ నేపథ్యాన్ని వెల్లడించాడు. 


ఈ సందర్భంగా తన బాల్యాన్ని, తనకు మొదటిసారి బ్యాట్ కొనివ్వడానికి తండ్రి  చేసిన రూ.800ల  అప్పుని గుర్తు చేసుకున్నాడు.  సెలవుల్లో ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియంలో క్రికెట్ క్యాంప్‌లో చేరాలని నిర్ణయించుకుని ,  దానికి సంబంధించిన ఫారాన్ని స్వయంగా నింపినపుడు తన తండ్రి కోపంతో తిట్టారని, అయితే  కోపం చల్లారిన తర్వాత రూ.800లతో క్రికెట్ బ్యాట్ కొనిచ్చారని చెప్పాడు.   ఇక నాకు క్రికెట్ కిట్ కావాలని అడిగినప్పుడు దాని ధర అడిగి  అది ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఉంటుందని తెలియడంతో  కాసేపు ఆలోచించుకొని క్రికెట్ ఆడడం మానేయమని తండ్రి చెప్పారన్నాడు.   తాను మొండిపట్టు పట్టి  బాత్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేశానని, ఇంట్లోంచి వెక్కిపోతానని చెప్పడంతో తన తల్లి   తన బంగారు గొలుసును అమ్మి  క్రికెట్ కిట్ కొనిచ్చిన విషయాన్ని మీడియా తో పంచుకున్నాడు.  


తాను టీమిండియాకు ఎంపికైన విషయం ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని జురెల్ తెలిపాడు. అయితే ఇంతకీ ఏ జట్టుకు ఎంపికయ్యావని ఇంట్లో వాళ్లు అడిగితే  రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా ఆడే భారత జట్టుకు ఎంపికయ్యానని చెప్పడంతో కుటుంబం మొత్తం భావోద్వేగానికి లోనైందని వివరించాడు. 


ఇక ధ్రువ్‌ జురెల్‌ ఆట విషయానికి వస్తే.. 

22 ఏళ్ల ధ్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌. 21 జనవరి 2001న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పుట్టాడు. దేశీవాళీ టీ20 టోర్నమెంట్‌ ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021’లో ఉత్తరప్రదేశ్ తరపున ధృవ్ బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై 23 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఆకట్టుకునేలా ఆడాడు. రంజీ ట్రోఫీలో విదర్భతో మ్యాచ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను ఆరంభించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేసి మొదటి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ధ్రువ్ కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడడంతో చెప్పకోదగ్గ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏమీ లేవు. 46.47 సగటుతో 790 పరుగులు చేయగా 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో జురెల్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. పరిమితి ఓవర్ల క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 19 టీ20 మ్యాచ్‌లు ఆడి 137.07 స్ట్రైక్ రేట్‌తో 244 పరుగులు చేశాడు.

 

తొలిసారి ఐపీఎల్‌లోనే...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరపున అరంగేట్రం చేసినప్పుడు ధృవ్ జురెల్ పేరు మొదటిసారి బాగా వినిపించింది. పెద్ద పెద్ద షాట్లు ఆడగల నైపుణ్యమున్న ఈ ఆటగాడు వికెట్ కీపర్‌గా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ యువకెరటాన్ని రూ.20 లక్షల బేస్ ధరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గత ఐపీఎల్ ఎడిషన్‌లో జురెల్ 11 మ్యాచ్‌లు ఆడి 152 పరుగులు కొట్టాడు. 172.72 స్ట్రైక్ రేట్‌తో భారీ షాట్లు కొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 

 

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు: 

రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, ధ్రువ్‌ జురెల్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అవేశ్‌ ఖాన్‌