టీమిండియా(Team India) టెస్టు జట్టు ఆటగాడు గాదె హనుమ విహారి(Hanuma Vihari) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర రంజీ జట్ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. ట్రోఫీలో భాగంగా శుక్రవారం ముంబై(Mumbi)తో మ్యాచ్‌కు ముందు విహారి కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు హనుమ విహారి ప్రకటించాడు. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విహారి కెప్టెన్‌గా వ్యవహరించగా... అతని స్థానంలో ఈ మ్యాచ్ నుంచి రికీ భుయ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. శుక్రవారం ముంబైతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూపు-బి మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ రిక్కీ భుయ్ ఆంధ్ర సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
మెరుగ్గా ముంబై
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 281 పరుగులు సాధించింది. ఓపెనర్లు జయ్ బిస్తా (39), భూపేన్ లాల్వాని (61) జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్ ఆజింక్య రహానె (0) విఫలమైనా.. సువేద్ పార్కర్ (41), శ్రేయస్ అయ్యర్ (48) జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. ఆంధ్ర బౌలర్లలో నితీశ్‌కుమార్‌రెడ్డి (3/44), షోయబ్‌ఖాన్ (2/42), లలిత్ మోహన్ (1/67) సఫలమయ్యారు. రంజీ ట్రోఫీ-2024లో తన ఆరంభ మ్యాచ్‌లో అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. గత మ్యాచ్‌కు దూరమై ఈసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (0) తొలి బంతికే నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం విశేషం. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ గోల్డెన్ డక్ కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.
ఈ వార్తలు నిజమేనా...?
ఆంధ్ర జట్టు తరఫున విహారి 30 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా.. ప్లేయర్‌గా కూడా సత్తాచాటాడు. 53 సగటుతో 2,262 పరుగులు స్కోర్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆంధ్ర బ్యాటర్లలో విహారి కూడా ఒకడు. అయితే హైదరాబాద్ మూలాలున్న కారణంగా హనుమ విహారి కొన్ని విషయాల్లో ఆంధ్ర జట్టులో బయటి ఆటగాడిగా కనిపిస్తున్నాడని 'క్రిక్‌బజ్' తెలిపింది. అయితే ఆంధ్ర క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఆర్‌వీసీహెచ్ ప్రసాద్ మాత్రం విహారి తనంతట తానుగా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడని.. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని వెల్లడించారు. "బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించేందుకు విహారి కాస్త విరామం తీసుకోవాలనుకున్నాడు. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విహారిని తప్పించాలని ఎలాంటి ఒత్తిడి లేదు" అని ప్రసాద్ తెలిపారు.
టీమిండియాలో ఇలా....
2018లో టీమిండియా టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన విహారి... ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో భారత జట్టు ఓడిపోయే స్థితిలో విహారి వీరోచిత పోరాటం చేశాడు. 161 బంతులను ఎదుర్కొని మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 111. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు.