ఇంగ్లండ్(England)తో జరిగే ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం తొలి రెండు టెస్టులకు జట్టు... అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. దాదాపుగా దక్షిణాఫ్రికా(South Africa)తో సిరీస్ లో తలపడిన జట్టునే ఎంపిక చేసింది. . గాయం నుంచి కోలుకోని స్టార్ పేసర్ మహ్మద్ షమి జట్టుకు ఎంపిక కాలేదు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్(KS Bharat) జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. అయితే, జట్టులో కేఎల్ రాహుల్(KL Rahul) కూడా ఉండటంతో అతను వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు మరోసారి నిరాశ తప్పలేదు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ వారికి అవకాశం దక్కలేదు. వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఇషాన్ కిషన్‌ను కూడా సెలక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్( Dhruv Jurel) అవకాశం కల్పించారు. ఉత్తర్‌ప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అయితే ఈ ధ్రువ్ జురెల్ ఎవ్వరన్న దానిపై అందరి దృష్టి పడింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాడిని టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయడం ఆశ్చర్య పరిచింది.
తక్కువోడేం కాదు...
22 ఏళ్ల ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. 21 జనవరి 2001న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పుట్టాడు. దేశీవాళీ టీ20 టోర్నమెంట్ ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021’లో ఉత్తరప్రదేశ్ తరపున ధృవ్ బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై 23 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఆకట్టుకునేలా ఆడాడు. రంజీ ట్రోఫీలో విదర్భతో మ్యాచ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను ఆరంభించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేసి మొదటి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ధ్రువ్ కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడడంతో చెప్పకోదగ్గ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏమీ లేవు. 46.47 సగటుతో 790 పరుగులు చేయగా 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో జురెల్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. పరిమితి ఓవర్ల క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 19 టీ20 మ్యాచ్‌లు ఆడి 137.07 స్ట్రైక్ రేట్‌తో 244 పరుగులు చేశాడు.
తొలిసారి ఐపీఎల్‌లోనే...
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసినప్పుడు ధృవ్ జురెల్ పేరు మొదటిసారి బాగా వినిపించింది. పెద్ద పెద్ద షాట్లు ఆడగల నైపుణ్యమున్న ఈ ఆటగాడు వికెట్ కీపర్‌గా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ యువకెరటాన్ని రూ.20 లక్షల బేస్ ధరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గత ఐపీఎల్ ఎడిషన్‌లో జురెల్ 11 మ్యాచ్‌లు ఆడి 152 పరుగులు కొట్టాడు. 172.72 స్ట్రైక్ రేట్‌తో భారీ షాట్లు కొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్