న్యూజిలాండ్‌(New Zealand )సీమర్‌ టిమ్‌ సౌతీ(Tim Southee) చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 150 వికెట్ల(150 T20I wickets) మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్‌(Pakistan)తో జరిగిన తొలి టీ20లో సౌతీ ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో టిమ్‌ సౌతీ.. మహ్మద్‌ రిజ్వాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌లను అవుట్‌ చేసి ఈ ఘనత సాధించాడు. అబ్బాస్‌ ఆఫ్రిదిని అవుట్‌ చేయడంతో అంతర్జాతీయ టీ20లలో 150 వికెట్లు తీసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టిమ్‌ సౌతీ 151 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 18 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది.


ఇటీవలే కివీస్‌కు షాక్‌
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కోల్పోయింది. కానీ, నేపియర్‌ వేదికగా జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో బంగ్లా సంచలన విజయం నమోదు చేసింది. దాదాపు 33 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌ గడ్డపై బంగ్లాదేశ్‌ వన్డేలో తొలి విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై ఇప్పటివరకూ 18 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్‌.. అన్నింటిలోనూ పరాజయం పాలైంది. కానీ ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మూడో వన్డేల సిరీస్‌ను 2-1తో కోల్పోయినా ఈ విజయం బంగ్లాకు ఉపశమనం కలిగించింది. మూడో వన్డేలో బంగ్లా పేసర్లు చెలరేగి పది వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో క్లీన్‌ స్వీప్‌ నుంచి బంగ్లాదేశ్‌ బయటపడింది.


మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్‌వాష్‌ చేయాలని భావించిన న్యూజిలాండ్‌ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది.
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆతిథ్య న్యూజిలాండ్‌ను 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు కివీస్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్‌ ఇస్లాం మూడు, తాంజిం హసన్‌ సకీబ్‌ మూడు, సౌమ్యా సర్కార్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. బంగ్లా ఫాస్ట్‌బౌలర్ల ధాటికి కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుదేలైంది. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో కివీస్‌ బ్యాటర్లు వచ్చినవారు వచ్చినట్లే పెవిలియన్‌ చేరారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్‌ ఆలౌట్‌ అయింది.


అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లా కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 15.1 ఓవర్లలో 99 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ షాంటో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనముల్ హక్ 37 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ బౌలర్లలో విలియం రోర్క్‌కు ఒక వికెట్ దక్కింది. న్యూజిలాండ్‌ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి వన్డే విజయం.