SLBC Rescue Operations: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే సొరంగంలో గల్లంతైన వారి జాడను జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే గల్లంతైన వారిలో కొందరిని నేటి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది.


ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుని 8 మంది గల్లంతైన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కోసం రెస్క్యూ చర్యలు సాగుతున్నాయి. ఇందుకోసం 15 రోజులుగా వివిధ ఏజెన్సీలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. NDRF, SDRF, NGRI,  Singareni, Rat Hole Mines, Hydra వంటి సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయి. మనుషులు చిక్కుకున్న ప్రదేశం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోవడంతో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్- NDMA కేరళ  SDRFను  కెడవర్ డాగ్స్​ సాయం తీసుకుంటున్నారు.


Also Read: పరీక్ష కేంద్రాల్లో 'గోడ గడియారాలు' పెట్టాల్సిందే, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు


కడావర్​ డాగ్స్​ గుర్తించిన డీ2 ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన కార్మికులకు శనివారం ఓ వ్యక్తి కుడి చేయి కనిపించింది. అప్రమత్తమైన కార్మికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు దాని చుట్టూ రెండు అడుగుల మేర మరో ఆరడుగుల లోతులో గొయ్యి తవ్వేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో మరో డెడ్​బాడీ ఉండవచ్చని భావిస్తున్నారు.


శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించడానికి తవ్వుతున్న ఈ టన్నెల్‌లో 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 15 కొనసాగుతున్న సహాయక చర్యలు ఇక చివరి దశకు చేరుకున్నట్లే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కన్వేయర్ బెల్టు సాయంతో శిథిలాల నుంచి మట్టి, బురదను బయటకు పంపిస్తున్నారు. రోబోటిక్ మిషనరీ బృందాలు కూడా టన్నెల్ లోపల కార్మికులను వెతికే పనిలో ఉన్నాయి. మట్టి, శిథిలాల్లో కూరుకుపోయిన వారిని నేడు, రేపు వెలికితీసే అవకాశాలున్నాయి.


Also Read: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు డ్రైవర్ల మృతి, 10 మందికి గాయాలు