Wall Clocks in Inter Exam Halls: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో గోడ గడియారాలను (Wall Clock) ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. మార్చి 10న పరీక్ష ప్రారంభమయ్యే నాటికి అన్ని కేంద్రాల్లోని గదుల్లో గడియారాలను సిద్ధం చేయాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య జిల్లాల ఇంటర్ అధికారులను మార్చి 8న ఆదేశించారు. ఈ సారి అధికారులు ఇంటర్ పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థుల గడియారాలను (స్మార్ట్ వాచ్, రిస్ట్ వాచ్‌) అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు సమయాన్ని సూచిస్తూ అరగంటకు ఒకసారి గంట కొడతారని, ఇన్విజిలేటర్లు కూడా సమయం చెబుతారని ఇటీవల బోర్డు కార్యదర్శి ప్రకటించారు. అయితే చాలా చోట్ల ఈ విధానాన్ని పాటించలేదు. దీంతో సమయం తెలియక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పరీక్షలను సరిగ్గా రాయలేకపోయామని విద్యార్థులు తమ తల్లితండ్రులకు చెప్పడంతో వారు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 1,532 పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదుల్లో వాల్ క్లాక్‌లను ఏర్పాటు చేయాలని కృష్ణ ఆదిత్య జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల(డీఐఈఓ)కు ఆదేశాలు జారీ చేశారు. 

ఒక్కో గోడ గడియారానికి రూ.100 కేటాయింపు..ఒక్కో గోడ గడియారం కొనుగోలుకు రూ.100 చొప్పున మంజూరు చేయనున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. అయితే గోడ గడియారం రూ.100కు రాదని, అధికారులే పెద్ద మొత్తంలో వాటిని కొని పరీక్షా కేంద్రాలకు సరఫరా చేయాలని టీజీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సురేష్ ఒక ప్రకటనలో ఇంటర్ బోర్డును కోరారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న పరీక్షలు..తెలంగాణలో మార్చి 5న ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రథమ సంవత్సరం సంస్కృతం/తెలుగు/హిందీ/ఇతర, ఇంగ్లిష్ పరీక్షలు ముగియగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్చి 7న సంస్కృతం/తెలుగు/హిందీ/ఇతర పరీక్ష ముగిసింది. మార్చి 10న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆలోపే గడియారాలను సిద్ధం చేసుకోవాలని ఇంటర్ బోర్డు పరీక్ష కేంద్రాల కళాశాలలను ఆదేశించింది.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 19తో ముగియనుండగా.. ఫస్టియర్ ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 24తో ముగుస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 25 వరకు నిర్వహించనున్నారు. అయితే సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 20తో ముగియనుండగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 25తో ముగుస్తున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు 5 నిమిషాల్లోపు ఆలస్యమైనా అనుమతిస్తున్నారు. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు.   

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ వారం పేపర్
05.03.2025  బుధవారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-1
07.03.2025  శుక్రవారం ఇంగ్లిష్ పేపర్ పేపర్-1
11.03.2025  మంగళవారం మాథ్స్ పేపర్ 1ఎ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
13.03.2025  గురువారం మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజి పేపర్-1, హిస్టరీ పేపర్-1
17.03.2025  సోమవారం ఫిజిక్స్ , ఎకనామిక్స్
19.03.2025  బుధవారం కెమిస్ట్రీ , కామర్స్
21.03.2025  శుక్రవారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
24.03.2025  సోమవారం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ వారం పేపర్
06.03.2025  గురువారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2
10.03.2025  సోమవారం ఇంగ్లిష్ పేపర్ పేపర్-2
12.03.2025  బుధవారం మాథ్స్ పేపర్ 2ఎ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
15.03.2025  శనివారం మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజి పేపర్-2, హిస్టరీ పేపర్-2
18.03.2025  మంగళవారం ఫిజిక్స్ , ఎకనామిక్స్
20.03.2025  గురువారం కెమిస్ట్రీ , కామర్స్
22.03.2025  శనివారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు)
25.03.2025  మంగళవారం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...