WPL 2025 UP Vs RCB Result Latest Updates: వరుసగా ఐదో పరాజయంతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. డబ్ల్యూపీఎల్ 2025 నుంచి నిష్క్రమించింది. శనివారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇప్పటికే టోర్నీ నుంచి ఔటైన యూపీ వారియర్జ్ చేతిలో 12 పరుగులతో ఓటమి పాలైంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన యూపీ.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాదించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జియా వోల్ అజేయ అర్థ సెంచరీ (56 బంతుల్లో 99 నాటౌట్, 17 ఫోర్లు, 1 సిక్సర్) త్రుటిలో సెంచరీని చేజార్చుకుంది. బౌలర్లలో జార్జియా వారేహమ్ కి 2 వికెట్లు దక్కాయి. ఇక రికార్డు ఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీ బాగానే పోరాడినా, లక్కు కలిసి రాలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఫైటింగ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 69, 6 ఫోర్ల, 5 ఫోర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచింది. మొత్తం మీద 19.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దీప్తి శర్మ, సోఫీ ఎకిల్ స్టోన్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. ఈ పరాజయంతో ఆర్సీబీ కథ ముగిసింది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు ఖాతాలో కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే యూపీ 8 మ్యాచ్ లు కంప్లీట్ చేసుకుని 6 పాయింట్లతో నిలిచింది. ఇక ఇప్పటికే 10 పాయింట్లు సాధించిన ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు చేరుకోగా, చెరో 8 పాయింట్లు సాధించిన ముంబై, గుజరాత్.. తాజా ఆర్సీబీ పరాజయంతో నాకౌట్ దశకు చేరాయి.
వోల్ విధ్వంసం..
ఎలాగూ ప్లే ఆఫ్స్ రేసులో లేమని భావించిన యూపీ తెగించి ఆడింది. ఓపెనర్ వోల్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసింది. ఆమెకు మరో ఓపెనర్ గ్రేస్ హారీస్ (39) కూడా సహకరించింది. వీరిద్దరూ కలిసి ఆర్సీబీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 49 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. ఆ తర్వాత హారిస్ వెనుదిరిగినా, యూపీ జోరు తగ్గలేదు. కిరణ్ నవగిరే విధ్వంసం (16 బంతుల్లో 46, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) సృష్టించడంతో యూపీకి ఎదురే లేకుండా పోయింది. ఈక్రమంలో 31 బంతుల్లో వోల్ ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. కిరణ్ ఔటయ్యాక తర్వాత బ్యాటర్లు ఎక్కువగా స్ట్రైక్ వోల్ కే ఇచ్చారు. అయితే చివరి బంతికి రెండు పరుగులు చేస్తే, సెంచరీ పూర్తవుతందన్న దశలో దీప్తి రనౌట్ కావడంతో వోల్ సెంచరీ మిస్సయ్యింది. తను 99 పరుగులతో అజేయంగా నిలిచింది. దీంతో టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (99 సోఫీ డివైన్) ని వోల్ సమం చేసింది. మిగతా బౌలర్లలో చార్లీ డీన్ కు ఒక వికెట్ దక్కింది.
బ్యాటర్లు విఫలం..
రికార్డు ఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీని బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. కెప్టెన్ స్మృతి మంధాన (4) తన పేలవ ఫామ్ ను కంటిన్యూ చేసింది. మరో ఓపెనర్, తెలుగు ప్లేయర్ సబ్బినేని మేఘన (27), ఎలీస్ పెర్రీ (28) కాసేపు కుదురుగా ఆడారు. వారి తర్వాత బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అయితే రిచా ఒంటరి పోరాటంతో జట్టు కు గెలుపు పై ఆశలు మిణుకుమిణుకు మన్నాయి. తను విరోచింతగా పోరాడినా, ఛేదన భారీగా ఉండటంతో ఏం చేయలేక పోయింది. చివర్లో స్నేహ్ రాణా (26) సిక్సర్లతో విరుచుకు పడటంతో జట్టు స్కోరు 210+ పరుగుల మార్కు దాటింది. మిగతా బౌలర్లలో చినెల్ హెన్రీకి రెండు, అజంలి సర్వాని కి ఒక వికెట్ లభించింది. వోల్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కారణంగా టోర్నీకి సండే సెలవు. మండే రోజు గుజరాత్ తో ముంబై.. ముంబై వేదికగా తలపడుతుంది.