Telangana News: తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత కన్నా తనకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాజకీయ పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందని అన్నారు. అలాంటి నాయకులు పార్టీలోకి వస్తూ పోతూ ఉంటారని.. అలా కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన తమకు ఎలాంటి నష్టం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల తరహాలో కార్యకర్తలు ఉన్నారని.. వారినే మనం నాయకులుగా తీర్చిదిద్దుకుందామని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫాం ఇచ్చి వారికి ఒక్క అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారని కేసీఆర్ చెప్పారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ప్రజలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ కోసం తాము 25 ఏళ్ల సుధీర్ఘ పోరాటం చేశామని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ని తిరిగి ప్రజలు ఎలాగైతే మళ్లీ సీఎంను చేశారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే రెట్టింపు మద్దతుతో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు బాగా మోసపోయారని.. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయిందని గ్రామాల్లో ప్రజలు బాధపడుతున్నారి కేసీఆర్ అన్నారు. 


పాలనలో దారి తప్పింది - కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేదని ఎంతో మంది ముందుకు వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దారికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం.. కాంగ్రెస్ పాలనలో దారి తప్పుతోందని కేసీఆర్ అన్నారు. అయినా ఎలాంటి ఆందోళన చెందవద్దని కేసీఆర్ హామీ ఇచ్చారు.