Konda Surekha Comments on Warangal: తెలంగాణలో వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేసే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉందని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 28న వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున మంత్రి సురేఖ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుంటారని తెలిపారు. వరంగల్‌లో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన గురించి సీఎం అధికారులతో సమీక్ష చేస్తారని చెప్పారు. వరంగల్ లో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను కూడా రేవంత్ రెడ్డి సందర్శిస్తారని కొండా సురేఖ చెప్పారు.


అటు హన్మకొండ కలెక్టరెట్ పరిధిలో కూడా వివిధ పనులపై రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తారని వెల్లడించారు. హన్మకొండ అభివృద్ది పనులపై, వరంగల్ మాస్టర్ ప్లాన్ అంశంపై రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తారని చెప్పారు. గత ప్రభుత్వ హాయాంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సొంత ఎజెండాతో చేసినదని.. దాన్ని మార్చాల్సి ఉందని అన్నారు. మరో 3 నెలల కాలవ్యవధిలో వరంగల్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల అంశంపై కూడా చర్చ ఉంటుందని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశం చర్చిస్తామని మంత్రి తెలిపారు. 


రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎంకు నివేదించనున్న పలు అంశాలపై  సమావేశంలో చర్చించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వనమహోత్సవం, మహిళాశక్తి కార్యక్రమం తదితర అంశాల పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ను  పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్లు సత్య శారదా దేవి, ప్రావీణ్య పాల్గొన్నారు.