Sitarama Project: ఉమ్మడి ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు సీతారామా ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇవాళ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది. ప్రాజెక్టులోని మొదటి పంపు నుంచి గోదావరి జలాలను ట్రయల్ రన్‌లో విడిచి పెట్టారు. ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి ప్రారంభించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ముందస్తుగా ట్రయల్ నిర్వహించింది. 


ఉమ్మడి ఖమ్మంలోని సుమారు పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఉద్దేశించి అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తైంది. దీనికి సంబంధించిన ట్రయల్‌ రన్‌ను ఇవాళ చేశారు. మొదటి పంపు నుంచి గోదావరి నీళ్లు ఎగసిపడుతుంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమాతకు  ప్రణమిళ్లారు. 


ఎన్నో ఏళ్ల ప్రజల కల నెరవేరే సమయం ఆసన్నమైందన్న మంత్రులు వీలైనంత త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. తన చివరి కోరిక ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందివ్వడమేనని అది నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టులో భాగమైన ఇంజనీర్లకు, భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞత తెలిపారు. 2004 కంటే ముందే దీనికి ప్రతిపాదనలు సిద్ధమైన రూపుదాల్చలేదు. 2016 ఫిబ్రవరి 16న కేసీఆర్‌ సీఎం హోదాలో శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ హయాంలో పనులు పూర్తి అయ్యాయి. 


సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ రన్ విజయవంతం అవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటిపారుదల విభాగంలో కేసీఆర్‌ చేసిన కృషి మరో ఉదాహరణగా ఈ ప్రాజెక్టను చూపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ఇంజినీర్లకు, అధికారులకు, ఏజెన్సీలకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు.   






మాజీ సీఎం కేసీఆర్ కల నెరవేరిందని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్‌పై ట్వీట్ చేసింది బీఆర్‌ఎస్ పార్టీ. "ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కల నిజమవుతున్న తరుణం..  గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్. గంగమ్మ జల సవ్వడులతో తడిచిన ఖమ్మం నేల. ఉమ్మడి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు అందనున్న సాగు నీరు." అని అభివర్ణించింది.