Telangana Cabinet: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైందనే టాక్ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న హడావుడి చూస్తుంటే వచ్చే వారంలోనే విస్తరణ ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఇంకా ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎవరితో నింపుతారనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకే వీటి కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన వివిధ కేంద్రమంత్రులతో సమావేశాలు అవుతూనే... అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నా ఆరు బెర్త్‌లతోపాటు నామినేటెడ్‌ పోస్టుల విషయంపై చర్చిస్తున్నట్టు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లినట్టు చెబుతున్నా దీని వెనుక పెద్ద ప్లానే ఉందని టాక్ వినిపిస్తోంది. 


మంత్రివర్గ విస్తర మాట తెలుసుకున్న ఆశావాహులు ఢిల్లీ బాట పట్టారు. సీనియర్‌ నేతలతోపాటు మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, రాజగోపాల్‌, వివేక్‌, రామచంద్రునాయక్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, జీవన్ రెడ్డి చాలా మంది నేతలు ఢిల్లీలో ఉంటూ మంతనాలు చేస్తున్నారు. అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తుంటే... మరికొందకు మంత్రులుగా తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


 మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ నలుగురికి మాత్రమే ఛాన్స్ దొరకొచ్చని టాక్. మిగతా రెండింటిని ఖాళీగా ఉంచి రాజకీయ పరిణామాలను బట్టి ఫిల్‌ చేయనున్నారని తెలుస్తోంది. చాలా మంది నేతలకు ఎన్నికల ముందు పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవులు ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు వాళ్లంతా అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాంటి వారిలో వివేక, రాజగోపాల్‌ రెడ్డి, శ్రీహరికి రేవంత్‌ రెడ్డితోపాటు అధినాయకత్వం కూడా హామీ ఇచ్చింది. దీంతో వారంతా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.