కాంగ్రెస్  పార్టీని, స్వాతంత్ర్య పోరాటాన్ని వేర్వేరుగా చూడలేమని.. నేటి స్వాతంత్య్ర ఫలాలకు 1885 నుంచి 1947 వరకూ పోరాటం చేసిన అఖిల భారత కాంగ్రెస్ నాయకులు కారణమని సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల చరిత్రలను దేశంలోని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు.  దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, గోపాలక్రిష్ణ గోఖలే, మోతీలాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బాబా సాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా ఎందరో మహానుభావుల పోరాటం, నాయకత్వం, త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు.


దేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని.. కాంగ్రెస్ పార్టీని వేర్వేరుగా ఎన్నటికీ చూడలేము అని.. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం.. ఆనాటి కాంగ్రెస్ నాయకులు శ్రమ, పట్టుదల, కష్టాల ఫలితం అని వ్యాఖ్యానించారు. మీడియా పాయింట్‌లో ఆదివారం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీకిగానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలకుగానీ స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర, చరిత్ర లేదన్నారు. స్వతంత్ర సంగ్రామ పోరాట చరిత్ర లేని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహనీయుడు సర్దార్ వల్లబాయ్ పటేల్ పేరును బీజేపీ, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు పేరును టీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఫొటోలు, బొమ్మలు పెట్టుకుని ప్రచారాలు చేసుకుంటూ ఆ పార్టీల నేతలు లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. 
Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!


‘దేశాన్ని బలమైన ప్రజాస్వామ్య పునాదులపై కాంగ్రెస్ పార్టీ నిర్మించగా.. దేశ స్వాతంత్య్రాన్ని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తున్నాయి. పంచవర్ష ప్రణాళికలతో దేశ అభివృద్ధికి కాంగ్రెస్ ఏనాడో పునాదులు వేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో దేశానికి పలు ఐఐటీలు, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. హరిత, శ్వేత విప్లవాలతో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ నేతల సొంతం. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన స్వాతంత్య్రాన్ని రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయని’ భట్టి విక్కమార్క మండిపడ్డారు.
Also Read: Karate Kalyani Joins BJP: బీజేపీలోకి కరాటే కల్యాణి, కేసీఆర్ ఆ డబ్బు బరాబర్ ఇవ్వాల.. బండి సంజయ్ డిమాండ్


ప్రతిపక్షాలు, న్యాయవ్యవస్థ, జర్నలిస్టులు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయకుండా అడ్డుకునేందుకు ఫెగాసెస్ స్పై వేర్‌తో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ప్రజాస్వామ్య పద్దతిలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని.. అయితే  అధికార మార్పిడి అత్యంత ప్రశాంత వాతారణంలో జరగాలన్నారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఆర్మీ చేతుల్లోకి వెళ్లడం.. మన దేశం మాత్రం ప్రజాస్వామ్యంగా ఉండటానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే కారణమన్నారు.