ఇండియాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు సైతం పెరిగిపోతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,23,863 (19 లక్షల 23 వేల 863) శాంపిల్స్‌కు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 36,083 మందికి కొవిడ్19 పాజిటివ్‌గా తేలింది.


అదే సమయంలో మరో 493 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,31,225 (4 లక్షల 31 వేల 225)కు చేరుకుంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల కంటే మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. నిన్న ఒక్కరోజులో 37,927 మంది కొవిడ్19ను జయించగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015 (3 కోట్ల 13 లక్షలు)కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,85,336 ఉన్నాయి. మొత్తం కేసులలో ఇవి 1.20 శాతమని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
Also Read: Nasal vaccine: ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్.. రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్!


దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. జనవరిలో టీకాల పంపిణీ మొదలుకాగా, నిన్నటివరకూ మొత్తం 54,38,46,290 డోసుల కరోనా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 73,50,553 డోసుల టీకాలు పంపిణీ చేశారు. కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసులలో దాదాపు సగం వరకు కేరళ నుంచే రావడం ఆందోళన పెంచుతోంది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్‌కు కేరళ కారణం అవుతుందా అని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇదివరకే ఆరుగురు సభ్యులతో కూడిన టీమ్ కేరళలో పర్యటిస్తోంది. ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు చేశారు. ఇదివరకే వీకెండ్ లాక్ డౌన్ కేరళలో కొనసాగుతోందని తెలిసిందే. భారత్ లో కరోనా రికవరీ రేటు 97.46 శాతానికి పెరిగింది. అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కరోనా తీవ్రత తక్కువగా ఉండటం అధికారులకు ఊరట కలిగిస్తోంది.
Also Read: Diabetes: మధుమేహాన్ని నియంత్రించడంలో ఇదే మంచి ఫుడ్ అంటున్న అధ్యయనాలు, ఆరోగ్యనిపుణులు