గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడే వారి కోసం త్వరలోనే ముక్కు ద్వారా వేసుకొనే టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం రెండు, మూడో దశ క్లినికల్ ట్రైల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ శుక్రవారం ప్రకటించింది. ఈ సంస్థ ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయస్సు వారిపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేశారు. 


దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కుద్వారా వేసే కరోనా వ్యాక్సిన్‌‌ను అభివృద్ధి చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లో గల భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ కరోనా టీకాకు ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. ప్రస్తుతం ఈ టీకాను సిరంజీ ద్వారా అందిస్తున్నారు. పైగా ఈ టీకాలను రెండు డోసులుగా తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవలసి ఉంటుంది.


భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని అంటున్నారు. ఇది అందుబాటులోకి వస్తే సిరంజీ ద్వారా వ్యాక్సిన్ తీసుకొనే బాధ తప్పుతుందని అంటున్నారు. నొప్పి లేకుండానే కరోనాకు ‘చుక్కలు’ చూపింవచ్చు. ఈ నసల్ స్ప్రే వ్యాక్సిన్‌‌ను ‘BBV154’గా పేర్కొంటున్నారు.  ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.


Also Read: విటమిన్-డి లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!


ఈ వ్యాక్సిన్‌ను పోలియో చుక్కల తరహాలోనే ముక్కు పుటల్లో వేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. పైగా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండానే శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ఇంగ్లాండ్‌లోని సర్రే కౌంటీలోని ఆశ్పార్డ్, సెయింట్ పీటర్స్ హాస్పిటల్స్, ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్ నిర్వహించిన ట్రైల్స్‌‌ ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ముక్క ద్వారా వేసే ఈ వ్యాక్సిన్‌తో కరోనాను 99.9 శాతం చంపేయవచ్చని తేలింది. ఈ వ్యాక్సిన్‌ను కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా, కెనడా యూకేల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే.. హెల్త్ వర్కర్లతో పని లేకుండా ప్రజలే స్వయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మరి ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. 


Also Read: ముంచుకొస్తున్న ‘మార్బర్గ్ వైరస్’.. కరోనా కంటే ప్రాణాంతకం, లక్షణాలివే!