‘వర్క్ ఫ్రం హోం’ వల్ల ఇళ్లకే పరిమితం అవుతున్నారా? కనీసం బయటకు వెళ్లకుండా కంప్యూటర్‌కే అతుక్కుపోతున్నారా? అయితే మీలో ఇప్పటికే విటమిన్-డి లోపం తలెత్తు ఉండవచ్చు. ఔనండి.. సూర్యుడి నుంచి సహజంగా లభించే సూర్యరశ్మి శరీరానికి చాలా అవసరం. అలాగని నిత్యం ఎండలో ఉండాల్సిన అవసరం లేదు. ఉదయం కనీసం అరగంటైనా సరే సూర్యరశ్మిలో నిలుచుంటే చాలు.. ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అయితే, ఒక్కసారి విటమిన్-డి లోపించందంటే.. కొన్నాళ్లు మందులు మింగాల్సి వస్తుంది. కాబట్టి.. డి-విటమిన్ లోపానికి సంబంధించిన లక్షణాలను ముందుగానే తెలుసుకోవడం ద్వారా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
విటమిన్-డి లోపమంటే ఏమిటీ? ఎలాంటి సమస్యలు వస్తాయి?: మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను, కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్-డి అవసరమవుతుంది. లేకుంటే ఎముకలు పెలుసుబారుతాయి. విటమిన్-డి స్టెరాయిడ్ హార్మోన్‌లా పనిచేస్తుంది. శరీరానికి సూర్యరశ్మి తగలగానే ఈ హార్మోన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. లేకుండా దాని పనితీరు మందకొడిగా సాగుతోంది. దీనివల్ల నరాల సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. రోగ నిరోధక శక్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. కండరాలు బలహీనం కాకుండా కాపాడేది కూడా డి విటమినే. రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడేవారు ‘విటమిన్-డి’ లోపం లేకుండా జాగ్రత్తపడాలి.
విటమిన్-డి లోపం వల్ల కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. మరికొందరిలో ఒత్తిడి, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి.. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తపడటమే కాకుండా, మీరు తీసుకొనే ఆహారంలో కూడా విటమిన్-డి ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరి. స్త్రీలు, వృద్ధులు రెగ్యులర్‌గా విటమిన్-డి స్క్రీనింగ్ చేయించుకోవడం ముఖ్యం.
ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి:
⦿ చిన్నపనికే అలసిపోవడం.
⦿ నిత్యం నిరుత్సాహంగా ఉండటం.
⦿ బాగా నీరసంగా ఉండటం.
⦿ కండరాల నొప్పి లేదా పట్టేయడం.
⦿ ఎముకల నొప్పులు.
⦿ మెట్లు ఎక్కడానికి ఇబ్బంది.
⦿ ఎక్కువ దూరం నడవడానికి ఇబ్బంది.
⦿ తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం.
⦿ జట్టు ఎక్కువగా రాలిపోవడం.
⦿ మొటిమలు, దద్దర్లు, మచ్చలు తదితర చర్మ సమస్యలు ఏర్పడతాయి.
ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి: పై లక్షణాలు కనిపిస్తే మీకు వైద్యులు విటమిన్-డి లోపం ఉందో లేదో తెలుసుకోడానికి రక్త పరీక్షలు చేస్తారు. సమస్య నిర్ధరణ జరిగితే మందులు రాస్తారు. అవి వాడుతూనే మీరు కొన్ని ఆహారాలను అలవాటుగా చేసుకోవడం మంచిది. లేకపోతే.. జీవితాంతం ఆ మందులను మింగాల్సి వస్తుంది. విటమిన్-డి ఎక్కువగా సూర్యరశ్మితోనే లభిస్తుంది. దానితోపాటు ఈ కింది ఆహారాల నుంచి కూడా విటమిన్-డిని పొందవచ్చు.
⦿ గుడ్డులోని పచ్చన సొన, చేపల ద్వారా విటమిన్-డి పొందవచ్చు.
⦿ ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ యోగర్ట్, సెరియల్ తీసుకోవాలి.
⦿ ఆర్గాన్ మీట్స్, నూనెలు, ఛీజ్, పన్నీర్, నెయ్యి, వెన్నలో ‘విటమిన్-డి’ పుష్కలంగా ఉంటుంది.
⦿ పుట్టగొడుగుల్లో కూడా విటమిన్-డి సమృద్ధిగా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసమే అందించాం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా డైట్ లేదా వ్యాధుల గురించి మరింత సమాచారం తెలుసుకోడానికి వైద్యుడిని సంప్రదించగలరని మనవి.