BJP Activist Sai Ganesh Suicide: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సాయిగణేష్ అనే బీజేపీ కార్యకర్త ఆత్మహత్య (Sai Ganesh, BJP Activist committed suicide)కు బాధ్యులైన స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోపాటు, టీఆర్ఎస్ నేతలపై పోలీసులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నేటి ఉదయం కార్యకర్త సాయి గణేష్ కు నివాళి అర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు బండి సంజయ్. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని వదిలిపెట్టబోం. కచ్చితంగా శిక్షించి తీరుతాం అన్నారు.
సీఎంఓ ఆదేశాలతో తగ్గారా?
టీఆర్ఎస్ నేతలు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ బీజేపీ నేతల్ని చూసి భయపడుతున్నారని, అందుకే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే మరణ వాంగ్మూలం నమోదు చేయలేదు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారు. తక్షణమే మంత్రి, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే’ అని డిమాండ్ చేశారు.
‘సాయి గణేష్ మృతికి కారణమైన సీఎంను, సంబంధిత పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బిజెపి కార్యకర్తల, యువకుల శోకానికి ఫలితం అనుభవించక తప్పదు. బిజెపి అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టం. ఖచ్చితంగా శిక్షిస్తామని’ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నమ్మిన సిద్ధాంతం కోసం సాయి గణేష్ కట్టుబడి ఉన్నాడని, అయితే టీఆర్ఎస్ నేతల అక్రమాలు అన్యాయాలపై పోరాడినందుకు అతడిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఖమ్మం టీఆర్ఎస్ నేతలు, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే నెలలో వివాహం, కానీ అంతలోనే విషాదం
బీజేపీ కార్యకర్త సాయి గణేష్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నం చేశాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత సాయి గణేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే వచ్చే నెల 4న సాయి గణేష్ వివాహం జరగనుంది. ఇంతలోనే ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే సాయి గణేష్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగానని సాయి తమతో చెప్పాడనీ బంధువులు అంటున్నారు.
Also Read: Khammam News : ఆ మంత్రి కారణంగానే బీజేపీ కార్యకర్త సూసైడ్, ఖమ్మంలో హై టెన్షన్!