Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టించింది. కూతురు చేసుకున్న కులాంతర వివాహం నచ్చక కక్ష పెంచుకున్న తండ్రి.. అల్లుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన భార్గవి అనే యువతిని రామకృష్ణ అనే యువకుడు 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి కక్ష పెంచుకున్న యువతి తండ్రి పక్కా ప్లాన్‌తో హత్య చేయించాడు. 


రెండు రోజుల క్రితమే రామకృష్ణను ట్రాప్ చేసి, మాయ మాటలు చెప్పి హైదరాబాద్‌కు పిలిపించాడు. అనంతరం కిరాతకంగా హత్య చేసి, సిద్దిపేట జిల్లాలో మృత దేహాన్ని పడేసి వచ్చినట్లు సమాచారం. అదృశ్యమైన హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట వద్ద పోలీసులు గుర్తించారు. రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు శవ పరీక్ష కోసం ప్రభుత్వ హాస్పిటల్‌లోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని కోసం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజు పల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ గతంలో హోం గార్డుగా పని చేసేవాడు. ఇతను హోంగార్డుగా పని చేసే సమయంలో యాదాద్రికి చెందిన భార్గవి అనే యువతిని 2020 ఆగస్టు 16వ తేదీన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు లింగరాజు పల్లిలో వీరు కాపురం చేశారు. ఆ తర్వాత భార్గవి గర్భవతి అయింది. ఆ తర్వాత నివాసాన్ని భువనగిరి పట్టణానికి మార్చారు. 6 నెలల కిందే వీరికి ఒక పాప కూడా పుట్టింది. అదే సమయంలో రామకృష్ణ గౌడ్ తుర్కపల్లిలో గుప్త నిధుల తవ్వకాల వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఉద్యోగం పోవడంతో రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. 


ఈ క్రమంలోనే ఈ నెల 15న బయటికి వెళ్లిన రామకృష్ణ గౌడ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన అతని భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు సిద్దిపేట వద్ద గుర్తించారు. రామకృష్ణ మామనే కిడ్నాప్ చేసి హత్య చేయించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.


కూతురిని తనకు కాకుండా చేశాడని..
రామకృష్ణ భార్య భార్గవి తండ్రి పల్లెపాటి వెంకటేశ్ ఓ వీఆర్‌వో. ప్రస్తుతం యాదాద్రిలోనే ఉంటున్నాడు. అయితే తన కూతురుని తనకు కాకుండా చేశాడని రామకృష్ణపై అతడు పగ పెంచుకున్నా. ఈ నేపథ్యంలోనే పలుమార్లు అల్లుడు కూతురిపై దాడులకు కూడా తెగబడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రామకృష్ణను అంతమొందించేందుకు మామ వెంకటేశ్, లతీఫ్ అనే రౌడీ షీటర్ కు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. అతడితో మాట్లాడి రియల్ ఎస్టేట్ వ్యవహారమని రప్పించి హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ హత్యలో లతీఫ్‌తో పాటు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.