కాల నాగులతో కాలం వెళ్ళదీస్తారు, అనకొండలతో ఆటలాడుకుంటారు, విష సర్పాలతో సహజీవనం చేస్తుంటారు. సింపుల్ గా చెప్పాలంటే పొట్టకూటికోసం ప్రాణాలనే ఫణంగా పెడతారు. అయినా వీరికి పూట గడవడం కష్టంగా మారుతోంది. మూడు పూటలా తిండికోసం ఇంటిల్లిపాది రోడ్లపైనా తిరగాల్సిన పరిస్థితి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎంతో మంది ప్రజాప్రతినిధులు మారారు. కాని వీరి తలరాతలు మాత్రం అలాగే ఉన్నాయి. కారణం.. ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే ఓటు బ్యాంకు వీరికి లేకపోవడమా లేక వంశపారంపర్యంగా వస్తున్న వృత్తినే వీరు నమ్ముకోవడమా?


పాము.. ఈ మాట వినగానే ఎవరికైనా ఒంట్లో భయం, వెన్నులో వణుకు పుడుతోంది. కాని ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లాడికి మాత్రం అదోక ఆట వస్తువు. బుసలు కొట్టే నాగుపామైనా అమాంతంగా మింగేసే కొండచిలువ అయినా ఏదైనా ఇతనికి ఒక్కటే. ఎదురుగా పాము కనిపించిందంటే చాలు దాని తోకపట్టుకుని ఆటలాడుకుంటాడు. పాము కనిపించగానే పదడుగుల దూరం పరిగెత్తాల్సిన ఈ బుడ్డోడు పైపైకి వెళ్ళి దాన్ని ఆటపట్టిస్తుంటాడు. పడగ విప్పి బుసలు కొడుతున్న నాగుపామును చూసి భయపడాల్సిన ఈ పిల్లాడు దాని ముందు డ్యాన్స్ చేస్తుంటాడు. 


విష సర్పం అనే భయం లేకుండా చేతిలో ఉన్న చిన్న పామును పడగ విప్పి బుసలు కొడుతున్న మరో పాము మీదకు విసిరేస్తుంటాడు. దీనికి కారణం పాము అంటే ఏమిటో తెలియకపోవడం ఒకటే కాదు. భయం కూడా లేకపోవడం.. కేవలం ఇది ఒక్క పిల్లాడి పరిస్థితి కాదు. శ్రీకాకుళం జిల్లాలో పాముల కులంలో పుట్టిన ప్రతీ ఒక్కరిది ఇదే పరిస్థితి. మందుల కులానికి చెందిన వీరికి పాములు పట్టడం వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. ఎక్కడైనా పాము ఉందంటే చాలు వెళ్ళి పట్టడం దానిని తీసుకెళ్ళి అడవుల్లో వదిలిపెట్టడం. అలా పట్టిన పాముల్లో కొన్ని పాములను వీరి వద్ద ఉంచుకుని పండగలు, జాతరలు అయ్యే సమయంలో వాటిని ఆడించి డబ్బు సంపాదించడం. అలావచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించడం. ఇది ఈ మధ్య వచ్చిన వృత్తి కాదు తమ ముందు తరాల నుండి వస్తున్న వృత్తి. ఈ వృత్తిలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 


పాములు పట్టేటప్పుడు లేదా పట్టిన పాముల నుండి విషం తొలగించేటప్పుడు అదే పాముకాటుకు బలైపోయిన సందర్భాలు కోకొల్లలు. మరో వృత్తి చేతకాని వీరు తరతరాలుగా పాములు పట్టడం లేదా పట్టిన పాములను ఆడించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కుల వర్గీకరణలో ముందు వీరిని బీసీ-ఏ జాబితాలో చేర్చినా వీరి ఆర్ధిక, సామాజిక పరిస్థితుల బట్టి వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ బలంగా వినిపించేది. సమైక్య రాష్ట్రంలో అది సాధ్యం కాకపోవడంతో రాష్ట్ర విభజన అనంతరం అసలు ఆ విషయాన్నే అందరూ మరచిపోయారు. దీనితో ఈ సామాజిక వర్గం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.


శ్రీకాకుళం జిల్లాలో వందల కుటుంబాలు
మందుల లేదా పాముల కులంగా పిలిచే ఈ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలో సుమారు వంద కుటుంబాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, సీతంపేట, కొత్తూరు పరిసర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటున్నారు. ఎవరి ఇంట్లోనైనా పాము దూరింది అని సమాచారం అందితే వెంటనే అక్కడ వాలిపోవడం అత్యంత చాకచక్యంగా దానిని పట్టుకోవడం. అలా పట్టిన తరువాత వాటిని తీసుకెళ్ళి అటవీ ప్రాంతంలో లేదా కొండ ప్రాంతంలో వదిలిపెట్టడం.. వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించడం.. ఇదే వీరి పని. అలా పట్టిన కొన్ని పాములకు కోరలు తీసి పండగలు, జాతరలు సమయాల్లో వాటిని ఆడించడం ద్వారా డబ్బులు సంపాదించిడం వీరికి వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీ. ఇలా వీరు పాములు పట్టే సమయాల్లో, లేదా పట్టిన పాములకు కోరలు తీసే సమయాల్లో వీరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. 


జిల్లాలో ఈ విదంగా చనిపోయిన వారి సంఖ్య సుమారు యాభై ఉంటుందని వారి బంధువులు చెప్తున్న లెక్కలు. పాములు పట్టడం తప్ప వేరొక వృత్తి చేతగాని వీరు తరతరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. పాములు పట్టే సమయంలో కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతే వెంటనే ఆ వృత్తిని వదిలేయాలి అని అనుకున్నా వీరిది వదల్లేని పరిస్థితి. అలవాటు ఆయిన పనిని వదులుకోలేక మరోవైపు వేరొక వృత్తి చేయలేక ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. అదే సమయంలో వీరికి ప్రభుత్వం నుండి గుర్తింపు కూడా లేకపోవడంతో అర్ధాకలితోనే వీరు కుటుంబాలను వెళ్ళదీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో బిసి-ఏ కు చెందిన ఇతర కులాలు ఎక్కువగా ఉండటంతో విద్యా, ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటున్నాయి. దీనితో తమ పిల్లలను చదివించినా ప్రయోజనం ఉండదనే ఆలోచనతో వీరు తమ వృత్తిలోనే కొనసాగిస్తున్నారు. దీనివలన పిల్లల బంగారు భవిష్యత్ ను చేజేతులారా నాశనం చేస్తున్నారు.


అలవాటు పడిపోతున్న పిల్లలు
శ్రీకాకుళం జిల్లాలో ఈ వృత్తిలో ఉన్న వంద కుటుంబాల్లో ఇప్పటివరకు సుమారు 50 మంది ఇదే వృత్తిలో ప్రాణాలు కోల్పోయారు. మధ్యం మత్తులో పామును పట్టుకోవడానికి ప్రయత్నించడం ఆ సమయంలో అది కాటేసిన సరిగ్గా పట్టించుకోకపోవడంతో అనాథలుగా మారిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాంటి చేదు ఘటనలు ఎదురయినప్పుడు తమ తరువాత తరం పిల్లలకు ఈ వృత్తి నేర్పకూడదు అని బలంగా నిర్ణయించుకున్నా అది వీరికి ఆచరణ సాధ్యం కావడం లేదు. ఇంట్లో పాములు ఉండటం వాటిని తమ కుటుంబ పెద్దలు ఆడించడం చూసి పిల్లలు కూడా అటువైపు ఆకర్షితులవుతున్నారు. ఇంట్లోనే పాములు ఉండటం చూసి వీరికి సగం భయం పోతుంటే వంశపారంపర్యంగా వస్తున్న ధైర్యం వీరిని పాములతో ఆటలాడేలా చేస్తుంది. పిల్లలు స్కూలుకు వెళ్ళినా అటునుండి రాగానే మరల ఈ పాములతో ఆటలాడటం వీరికి అలవాటుగా మారిపోతుంది. 


ప్రభుత్వం ఏదో విదంగా సహాయం చేస్తే  వ్యాపారం చేసుకుని ఈ వృత్తికి దూరంగా బ్రతుకుతామని కొంతమంది వేడుకుంటున్నారు. పొట్ట పోషణ కోసం ఈ వృత్తిలో కొనసాగుతున్నాం తప్ప ప్రభుత్వం వేరొక అవకాశం కల్పిస్తే తప్పకుండా ఈ వృత్తిని వదిలేస్తామంటున్నారు. పాములు పట్టడం వల్ల ప్రాణహాని మాత్రమే కాదని కొంతమంది అధికారుల వేధింపులు ఉంటున్నాయంటున్నారు. అందువల్ల ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకుని తమకు రుణ సదుపాయం కల్పించడమే కాకుండా పిల్లలకు ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వచ్చి మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చుతాం లోన్లు ఇప్పిస్తామని చెప్పి వెళ్లిపోయారని ఆ తరువాత ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ సామాజిక ఆర్ధిక పరిస్థితులను గుర్తించి తమ కులాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మరిన్ని కుటుంబాలు రోడ్డున పడతాయిని పిల్లల బంగారు భవిష్యత్ కూడా నాశనమైపోతుందని అంటున్నారు.