Khammam News : ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతానికి చెందిన సాయిగణేష్‌ అనే బీజేపీ కార్యకర్త పోలీసుల వేధింపుల వల్లే మృతి చెందాడని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల ఒత్తిడి వల్లే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడడని ఆరోపించారు. సాయి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతానికి చెందిన సాయిగణేష్‌ గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన పార్టీ దిమ్మెను కొంతమంది ధ్వంసం చేశారు. ఈ విషయంపై త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, దీంతో పాటు సాయి గణేష్‌ను పోలీసులు తిట్టడం వల్లే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సాయిగణేష్‌ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తీసుకురావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో సుమారు రెండు గంటల పాటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 



వచ్చే నెల 4న సాయి వివాహం 


బీజేపీ కార్యకర్త సాయి గణేష్ పోలీస్‌ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నం చేశాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత సాయి గణేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే వచ్చే నెల 4న సాయి గణేష్ వివాహం జరగనుంది. ఇంతలోనే ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే సాయి గణేష్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగానని సాయి తమతో చెప్పాడనీ బంధువులు అంటున్నారు. 


మంత్రి పువ్వాడ అజయ్ కార్యాలయం వద్ద బందోబస్తు 


ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతి చెందడంతో మంత్రి అజయ్‌ కుమార్‌ కార్యాలయం, జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు భారీగా  పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కారణంగా బీజేపీ కార్యకర్త మృతి చెందాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ పై అక్రమ కేసులు పెట్టారని దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంటున్నారు. మంత్రి కార్యాలయం చుట్టూ భారీ గేట్లను ఏర్పాటు చేసి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తగలబెట్టారు. వారిని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.