Hyderabad Hanuman Shobayatra : హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజ రంగ్ దళ్, వీహెచ్పీల ఆధ్వర్యంలో గౌలిగూడ రాంమందిర్ నుంచి శోభాయాత్ర బైక్ ర్యాలీ కొనసాగుతోంది. హనుమాన్ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ తాడ్ బంద్ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. శోభాయాత్రలో నడిచే హనుమాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మరోవైపు హనుమాన్ శోభాయాత్రలో మహిళలు బైక్ ర్యాలీ ప్రత్యేకంగా నిలుస్తోంది. బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. 200 బైక్‌లతో కాషాయ జెండాలతో మహిళలు ర్యాలీ చేస్తున్నారు. ప్రస్తుతం శోభాయాత్ర భాగ్యనగరంలో కొనసాగుతోంది.
కర్మన్ ఘాట్ నుంచి యాత్ర ప్రారంభం
హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి శోభాయాత్ర చేపట్టారు. ఈ యాత్రంలో కశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రకు ఎనిమిది వేలమంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. కర్మన్ ఘాట్ టెంపుల్ నుంచి తాడ్ బంద్ వరకు 21 కిలోమీటర్లు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయం కమిటీ సభ్యులు దర్శనానికి పూర్తి ఏర్పాట్లు చేశారు.
నిజామాబాద్ శోభాయాత్రలో వర్గపోరు
నిజామాబాద్ నగరంలో బీజేపీ నాయకుల మధ్య వర్గపోరు బయటపడింది. నగరంలో హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ నాయకులు ఎండల లక్ష్మీ నారాయణ, ధన్ పాల్ సూర్య నారాయణ గుప్త మధ్య వాగ్వాదం జరిగింది. ధన్ పాల్ పై ఎండల లక్ష్మీ నారాయణ చేయి చేసుకున్నారు. ఎంపీ అరవింద్ వచ్చేవరకు ఆగాలని ధన్ పాల్ వాదించగా వినకుండా ఎండల దురుసుగా ప్రవర్తించారంటూ ధన్ పాల్ వర్గం ఆరోపిస్తుంది.