TDP Chief Chandrababu tweets over Kalyanadurgam Infant Death: ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరడం సామాన్యుల ప్రాణాల మీదకు తెచ్చిందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం తీసుకెళ్తున్న చిన్నారి.. మంత్రి కాన్వాయ్ కోసం 15 నిమిషాలు ట్రాఫిక్ నిలిపివేయడంతో చనిపోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. సత్య సాయి జిల్లా కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ (AP Minister Ushasri Charan) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గం కళ్యాణదుర్గానికి వచ్చారు. ఆమెకు పార్టీ శ్రేణులుగు ఘన స్వాగతం పలకగా.. మంత్రిగారి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
చిన్నారి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం..
ఏపీ మంత్రి విజయోత్సవ ర్యాలీ కారణంగా నెలల చిన్నారి చనిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) తీవ్రంగా స్పందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోడానికి కారణం అయ్యారు. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణం అని వ్యాఖ్యానించారు.
అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే చిన్నారిని అడ్డుకోవాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? అని చంద్రబాబు ప్రశ్నించారు. అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెపుతారు? చావు డప్పులో పదవీ సంబరాలు జరుపుకున్న మంత్రి... ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారు అని ట్విట్టర్ వేదికగా సూటిగా ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే..
ఓ వైపు ఉషశ్రీ చరణ్ మంత్రి అయ్యాక తొలిసారి కళ్యాణదుర్గం వచ్చిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్ ఈరక్క దంపతులు తమ చిన్నకుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో బైకుపై ఆర్జీటీ ఆసుపత్రికి బయలుదేరారు. కానీ కళ్యాణదుర్గంలో ట్రాఫిక్ నిలిపివేయడంతో అరగంటపాటు రోడ్డుపైనే నిలిచిపోయారు. దారివ్వాలని వేడుకున్నా పోలీసులు తమ మాట వినిపించుకోలేదని చెప్పారు. ట్రాఫిక్ పునరుద్ధరించాక వీరు ఆసుపత్రికి చేరుకున్నారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి ఊరేగింపు, ట్రాఫిక్ జామ్ వల్లె చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఇప్పుడు మాపాపను ఎవరు తెచ్చిస్తారంటు చిన్నారి తల్లితండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
Also Read: Kalyanadurgam News : మంత్రి ర్యాలీలో పోలీసుల అత్యుత్సాహం, సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి!
Also Read: Kamareddy: కామారెడ్డిలో దారుణం - లాడ్జీలో తల్లీకుమారుడు ఆత్మహత్య, సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో !