Kalyanadurgam News : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పోలీసుల అత్యుత్సాహం ఓ చిన్నారి ప్రాణం తీసింది. అత్యవసర చికిత్స బాలికను ఆసుపత్రికి తరలిస్తుంటే మంత్రి ర్యాలీ వస్తుందని పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో చిన్నారిని తరలిస్తున్న బైక్ ట్రాఫిక్ లో 20 నిమిషాల పాటు చిక్కుకుపోయింది. 108 అంబులెన్స్ కు ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదని చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కారణంగా తన కోడలు చనిపోయిందని చిన్నారి మేనమామ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలన్నారు. 



అసలేం జరిగిందంటే.  


మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గానికి విచ్చేసిన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ కు వైసీపీ కార్యకర్తలు, అనుచరులు భారీగా ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కంబదూరు మండలం చేర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్ ఈరక్క కూతురు పండు అనే చిన్నారికి ఆరోగ్యం బాగలేకపోవడంతో  హుటా హుటిన కళ్యాణదుర్గంలోని ఆసుపత్రికి బైకులో తీసుకువస్తున్నారు. పట్టణ సమీపంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లించామని 20 నిమిషాలు ఆపేశారని సకాలంలో వైద్యం అందక పాప చనిపోయిందని మేనమామ  ప్రశాంత్ ఆరోపిస్తున్నారు. 108 కూడా సకాలంలో స్పందించలేదని వాపోయారు.






బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్  


మంత్రి ఉషాశ్రీ చరణ్ స్వాగత కార్యక్రమం ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని చాటుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన 8 నెలల చిన్నారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో మంత్రి ఊరేగింపు కోసం పోలీసులు రహదారిలో రాకపోకలు నిలిపివేయడం వల్ల సకాలంలో వైద్యం అందక చిన్నారి మరణించడం అత్యంత విషాదమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తగిన న్యాయం చేయడానికి మంత్రి ఉషశ్రీచరన్ ప్రయత్నించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించడంతో పాటు అన్ని విధాలా వారికి న్యాయం చేయాలని కాలవ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.